బాబును బావగా మార్చిన విజయ చాముండేశ్వరి !

Seetha Sailaja
నిన్న మహానటి’ సినిమా యూనిట్‌   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ‘మహానటి’ సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ ను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా ‘మహానటి’ సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి అన్నమాటలు ఆ ఫంక్షన్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

సావిత్రి కుటుంబానికి నందమూరి తారకరామారావు కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం గురించి అనేక విషయాలు వివరిస్తూ తాను ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా ? బావగారు అనాలా’ తెలియడంలేదని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మహానటి కుమార్తె. దీనికి కారణం తాను తన చిన్నతనంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని అక్కా అని పిలిచేదాన్నని చెపుతూ అప్పటి విషయాలను ఆమె గుర్తుకుకు చేసుకుంది. 

తన తల్లి పుట్టిన ఊరిలో ఈ సత్కార కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ తన తల్లి పై తీసిన సినిమా ఘన విజయం సాధించిన నేపధ్యంలో తనను ముఖ్యమంత్రి సత్కరించడం తాను జీవితంలో మరిచిపోలేని సంఘటన అంటూ ఉద్వేగానికి గురి అయింది విజయ చాముండేశ్వరి. ఇదే సందర్భంలో తన అమ్మ పాత్ర చేసిన కీర్తి సురేశ్ గురించి మాట్లాడుతూ తనకు ఈలోకంలో లేని తన అమ్మను చూడాలి అని అనిపించినప్పుడల్లా తాను కీర్తి సురేశ్ ఇంటికి వెళతాను అంటూ ఆమెతో తనకు ఏర్పడ్డ సాన్నిహిత్యాన్ని వివరించింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్వర్యంలో జరిగిన ఈ ఫంక్షన్ లో చంద్రబాబు ‘మహానటి’ మూవీని ప్రశంసిస్తూ సావిత్రి జీవితం గురించి ఈనాటి తరానికి తెలియవలసిన అవసరం ఉందని దానికోసం ‘మహానటి’ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ కల్పిస్తుంది అంటూ ప్రకటన చేసారు. అయితే నిర్మాత అశ్వినీదత్ ఈ సూచనను సున్నితంగా త్రిరస్కరిస్తూ ‘మహానటి’ మూవీ వినోదపు పన్ను రాయితీవల్ల వచ్చే డబ్బును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలకు ఉపయోగపడే విధంగా ఖర్చుపెట్టమని సూచించడం ఇక్కడి ట్విస్ట్. మంచి సినిమాలు తీసిన చాలామంది నిర్మాతలు ప్రభుత్వాల నుండి వినోదపు పన్ను రాయితీ కోరుతుంటే అశ్వినీదత్ తన ‘మహానటి’ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ చేసిన ఈరాయితీని తిరస్కరించడం హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: