ఎన్టీఆర్‌కు మోహన్‌లాల్‌.. నాన్న కాదు పెదనాన్న!

Krishna A.B
కొరటాల శివ రూపొందించే సినిమాల్లో పెద్దతరానికి ప్రాతినిధ్యం వహించే పాత్రకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. ఒకసారి మిర్చిలోని సత్యరాజ్‌ పాత్రను గుర్తుచేసుకోండి. ఆ పాత్ర నమ్మే నైతిక విలువల మీదనే కథ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రీమంతుడు చిత్రంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌ల పాత్రలు కూడా! తాజాగా కొరటాల శివ జూనియర్‌ ఎన్టీఆర్‌తో రూపొందించబోతున్న చిత్రంలో కూడా ఓ పెద్దతరహాతో కూడిన పాత్ర ఉందనే సంగతి అందరికీ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ పాత్రకోసం మళయాల సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ను తీసుకుంటున్నారని కూడా టాలీవుడ్‌ మొత్తం పొక్కిపోయింది. 


అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో మోహన్‌లాల్‌ ఉంటారనే అంతా అనుకుంటూ వచ్చారు. కాకపోతే తాజాగా సినిమా కు సంబంధించిన వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి.. ఎన్టీఆర్‌కు పెదనాన్న పాత్రలో మోహన్‌లాల్‌ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదివరకటి రెండు చిత్రాల్లోనూ ఈ విలువలను ఆశ్రయించి, ఆదర్శంగా కనిపించే రెండు పాత్రల్లోని వెటరన్‌ నటులు.. హీరోకి తండ్రిగానే కనిపించారు. కానీ కొరటాల శివ ఈ కథను కాస్త భిన్నంగా తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది. 


అయితే శివ రూపొందించిన పాత చిత్రాల్లాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ పాత్రకు చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. పైగా అతిథి తరహా మొక్కుబడి పాత్రలో కాకుండా పూర్తిస్థాయిలో కథలో ఉండే పాత్రగానే ఆయన ఉంటారని చెబుతున్నారు. జూనియర్‌తో సమానమైన ప్రాధాన్యంతో ఈ పాత్ర కూడా ఉంటుందిట. ఇద్దరు హీరోయిన్లతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: