సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు రెమ్యునరేషన్స్ సమానంగా ఉండవు. హీరోలకు ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు ఉంటే హీరోయిన్లకు మాత్రం రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు మాత్రమే ఉంటున్నాయి. కొంతమంది హీరోయిన్లకు అయితే కోటి కంటే తక్కువే. స్టార్ హీరోయిన్లు సైతం పది కోట్లకు మించి తీసుకోవడం లేదు. అయితే ఆడ మగ ఇద్దరూ సమానమే అని చెప్పేందుకు స్టార్ హీరోయిన్ సమంత ఓ మంచి నిర్ణయం తీసుకుంది. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా సామ్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సినిమాలో మహిళలు అనే టాపిక్ గురించి మాట్లాడుతూ... ఇండస్ట్రీలో మేల్ యాక్టర్స్, ఫీమేల్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ లో ఉన్న తేడాల గురించి మాట్లాడింది. తమ సినిమాలకు మంచి ఇన్వెస్టర్లు దొరకాలంటే మేల్స్ కంటే ఫీమేల్స్ రెండింతలు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పింది. ఓ మేల్ డైరెక్టర్ నాలుగేళ్లలో సాధించింది సాధించాలి అంటే ఫీమేల్ డైరెక్టర్ కి 8 ఏళ్లు పడుతుందని చెప్పింది. కానీ సమంత నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో అందరికి సమానమైన రెమ్యునరేషన్స్ ఇస్తోందని చెప్పింది.
ఇక ఈ సినిమాతో సమంత ప్రొడ్యూసర్ గా మారుతుండగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ సైతం ప్రారంభించింది. ఈ చిత్రంలో పనిచేస్తున్న వారందరికీ లింగభేదం లేకుండా రెమ్యునరేషన్స్ ఇస్తున్నట్టు సమంత తనతో చెప్పిందని నందినీ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే సమంత ఎప్పుడూ ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా సమంత స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా సినిమాలోనూ సమాన వేతనాలు ఇస్తూ చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది.