ఇండియన్ 2: సాలిడ్ అప్డేట్.. ఇక ఆగేదేలే?

Purushottham Vinay
విశ్వ నటుడు కమల్ హాసన్ రీసెంట్ గా విక్రమ్ సినిమాతో కోలీవుడ్ లో పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 450 పైగా కోట్ల వసూళ్లు సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత కమల్‌ హాసన్‌  - శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న భారీ ప్రాజెక్ట్‌ 'ఇండియన్‌ - 2'.సుమారు రెండేళ్ల క్రితం వాయిదా పడిన ఈ సినిమా నుంచి తాజాగా రెండు అప్‌డేట్‌లు బయటకు వచ్చాయి. వివిధ కారణాలతో నిలిచిపోయిన ఈ సినిమా షూట్‌ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. 'అతను మళ్లీ వచ్చేశాడు' అని పేర్కొంటూ షేర్‌ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాకుండా, 'భారతీయుడు-2' చిత్ర నిర్మాణంలో ఇకపై ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌గైంట్‌ మూవీస్‌ కూడా భాగమైంది. ఇక, బుధవారం పూజా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ నెట్టింట షేర్‌ చేసింది.



శంకర్‌ - కమల్‌ హాసన్‌ కాంబోలో 1996లో విడుదలైన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా ఈసినిమా సిద్ధమవుతోంది. 2017లో ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించినప్పటికీ 2019లో దీన్ని పట్టాలెక్కించారు. సినిమా చిత్రీకరణ సజావుగా సాగుతోన్న తరుణంలో 2020 ఆరంభంలో సెట్‌లో క్రేన్‌ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో షూట్‌ని కొంతకాలం వాయిదా వేశారు. అలా, వాయిదా పడిన ఈ సినిమా కరోనా, చిత్ర నిర్మాణం విషయంలో దర్శకుడు శంకర్‌కు, నిర్మాణ సంస్థకు విబేధాలు తలెత్తడంతో సుమారు రెండేళ్ల నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈక్రమంలోనే కమల్‌ 'విక్రమ్‌' పూర్తి చేసి హిట్‌ సొంతం చేసుకున్నారు. ఇక రేపటినుండి ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ 15 దాకా చెన్నైలో స్టార్ట్ చేయనున్నారు.మరోవైపు శంకర్‌ సైతం రామ్‌ చరణ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు. త్వరితగతిన 'ఇండియన్‌ - 2' పూర్తి చేయాలని కమల్‌ హాసన్‌ - శంకర్‌ భావించడంతో సినిమా తిరిగి మొదలవుతోంది. ఇక ఈ సినిమాతో కమల్ సరికొత్త రికార్డులు నమోదు చెయ్యటం ఖాయం. మరి చూడాలి శంకర్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: