హ్యాపీ బర్త్ డే : క్యూటీ.. బ్యూటీ జెనీలియా..!

NAGARJUNA NAKKA
అందం.. అభినయం.. కలగలిస్తే జెనీలియా. అమాయకంగా.. అల్లరి చిల్లరగా.. కొంటె చేష్టలతో కవ్వించి ప్రేక్షకులకు దగ్గరైపోయింది ఈ అమ్మడు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగువారి హాసినిగా ముద్రపడిపోయింది. జెనీలియా టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్రాలలో నటించి తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

జెనిలీయా పూర్తి పేరు జెనీలియా డిసౌజా. ఆగస్ట్ 5వ తేదీన 1982వ తేదీన ముంబయిలో పుట్టింది. వీళ్లు మరాఠీ క్రిస్టియన్స్. జెనీలియా తల్లిదండ్రులు నీల్ డిసౌజా, జియా డిసౌజా. జెనీలియా తన హైస్కూల్ చదువంతా బాంద్రాలో పూర్తయింది. అపోస్తలిక్ కార్మెల్ హైస్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్ మాత్రం సెంట్ ఆండ్రూస్ కళాశాలలో పూర్తి చేసింది. ఆ సమయంలోనే పార్కర్ పెన్ కు సంబంధించిన ప్రకటనలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో యాక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆ ఛాన్స్ తన పరీక్షలకు రెండు రోజుల ముందే వచ్చింది. దీంతో ఆమె ఆ ప్రకటనలో నటించేందుకు అంగీకరించలేదు. యాడ్ డైరెక్టర్ బతిమాలుకోవడంతో ఏదోవిధంగా ఒప్పేసుకుంది. దీంతో జెనీలియా పేరు మార్మోగిపోయింది. అమితాబ్ నుంచి కూడా ఆమెకు ప్రశంసలు దక్కాయి.


జెనీలియాకు చదువు, ఆటలంటే విపరీతమైన ఆసక్తి. ఫుట్ బాల్ క్రీడలో జాతీయ స్థాయికి వెళ్లింది కూడా. ఇక డిగ్రీ చేస్తున్న సమయంలో తుజే మేరీ కసం అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది జెనీలియాకు. ఈ సినిమా మళయాళంలో హిట్ కొట్టింది. ఇదే సినిమాను తెలుగులో నువ్వేకావాలి పేరుతో తీసుకొచ్చారు.  మొదట ఆమె ఒప్పుకోకపోయినా.. తెలుగు సినిమా నువ్వే కావాలి చూసిన తర్వాత జెనీలియా మనసు మారిపోయింది. తుజే మేరీ కసం చిత్రానికి ఒకే చెప్పేసింది. ఈ సినిమా షూటింగ్ లో రితేష్.. జెనీలియాలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ సమయంలోనే డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది జెనీలియా. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  


ఆ తర్వాత దర్శక మాంత్రికుడు శంకర్.. పార్కర్ పెన్ ప్రకటన చూసి ఎలాంటి ఆడిషన్స్ లేకుండా జెనీలియాను బాయ్స్ సినిమాకు తీసుకున్నాడు. ఆ చిత్రం తమిళం, తెలుగులో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత సత్యం మూవీలో సుమంత్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక జెనీలియా ‘బొమ్మరిల్లు’ చిత్రంలో యాక్టింగ్ విషయంలో మెప్పించింది. హాసిని పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గానూ.. ఫిలింఫేర్ పురస్కారంతో పాటు నంది అవార్డు కూడా అందుకుంది. అలా ఆమె స్టార్ హీరోయిన్ ల సరసన స్థానం సంపాదించుకుంది. ఇక హ్యాపీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన యాక్ట్ చేసి వావ్ అనిపించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించింది. ఆ టైమ్ లోనే రితేష్.. జెనీలియాల మధ్య ప్రేమ చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: