ఢీ - 2 మూవీ ..... ఆ స్టార్ కమెడియన్ కు బిగ్ బ్రేక్ ఇవ్వనుందా .....??
మంచు వారబ్బాయి విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ మూవీ 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దివంగత నటుడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ హీరోయిన్ గా నటించగా, సిరి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, చారి అనే పాత్రలో తన హాస్యపు జల్లులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. కోన వెంకట్, గోపి మోహన్ కథ, మాటలు, శ్రీనువైట్ల అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో, హీరోయిన్ల వండర్ఫుల్ పెరఫార్మన్స్, సంగీత దర్శకుడు చక్రి అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు బ్రహ్మానందం క్యారెక్టర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.
అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు అతి త్వరలో సీక్వెల్ గా ఢీ - 2 మూవీ రానున్నట్లు తెలుస్తోంది.మీరు త్వరలో నటించనున్న ఢీ - 2 ఎప్పుడు మొదలవుతుంది, ఎవరెవరు నటిస్తున్నారు అంటూ, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇటీవల కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విష్ణు, ఆ విషయం మీరు శ్రీను గారిని అడగాలి అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇప్పటికే ఢీ - 2 కి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ని, తన బృదంతో కలిసి సిద్ధం చేసిన శ్రీను వైట్ల, ప్రస్తుతం సినిమాలోని ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని, అలానే మొదటి భాగం మాదిరిగా ఈ సీక్వెల్ లో కూడా బ్రహ్మి క్యారెక్టర్ ఎంతో అదిరిపోనుందని, ఇటీవల ఈ సినిమా విషయమై ఆయనను కలిసిన శ్రీనువైట్ల, కథ వినిపించి, ఆయనను నటింపచేయడానికి ఒప్పించినట్లు చెప్తున్నారు.
అన్నీ కలిసి వస్తే రాబోయే మరొక మూడు నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కనుందని, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మొదటి భాగాన్ని మించేలా మరింత కామెడీ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో, బ్రహ్మానందం కు కెరీర్ పరంగా మంచి బ్రేక్ రావడం ఖాయం అని, అలానే మరోవైపు కెరీర్ పరంగా అపజయాలు అందుకుంటున్న శ్రీను వైట్ల కెరీర్ కూడా ఈ సినిమాతో గాడిలో పడుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, బ్రహ్మి కామెడీ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కామెడీ ప్రియులకు ఇది మంచి పండుగ లాంటి వార్త అని చెప్పకతప్పదు .....!!