అబ్బబ్బా విజయ్ దేవరకొండ...... నువ్వు నిజంగా బంగారుకొండ....!!

GVK Writings

టాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాప్ టాలీవుడ్ స్టార్స్ లో ఒకరు అని చెప్పకతప్పదు. ముందుగా రవిబాబు తీసిన నువ్విలా సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసిన విజయ్, ఆ తరువాత లైఫ్ ఈఫ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించడం జరిగింది. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ఆ తరువాత కొంత గ్యాప్ అనంతం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా నటించిన ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకున్న విజయ్, ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో మరొక రెండు అత్యద్భుత విజయాలు అందుకుని టాలీవుడ్ స్టార్ హీరో గా ఎదిగారు. 

 

 

ఇక ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, ఆకట్టుకునే అందం అభినయంతోపాటు మంచితనంలో కూడా తనకు తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో తనవంతుగా వీలైనంత సాయం చేసి మంచి సామజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కూడా నిరూపించుకున్నారు విజయ్. ఇక గత కొద్దికాలంగా ప్రపంచం మొత్తాన్ని కూడా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలు కూడా ఎక్కడి ప్రజలను అక్కడే తమ తమ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానితో ఎందరో ప్రజలు, పనులు చేయడానికి వీలు లేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడడం జరిగింది. అయితే ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దిగువ వర్గాల వారికి కొంతమేర ఆర్ధిక సాయంతో పాటు ఫ్రీ రేషన్ ని కూడా ప్రకటించడం జరిగింది. 

 

కాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మేము కూడా మావంతుగా సాయం అందిస్తాము అంటూ పలు రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులతో పాటు సినిమా పరిశ్రమ వారు కూడా ముందుకు వచ్చి తమ గొప్ప మనసుతో విరాళాలు అందివ్వడం జరిగింది. ఇక విజయ్ దేవరకొండ అయితే ఏకంగా రూ.1.30 కోట్లు తనవంతు సాయాన్ని ప్రకటించడం తో పాటు మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి పలువురి నుండి విరాళాలు సేకరిస్తూ, ఎక్కడికక్కడ ఆహారం కోసం అలమటిస్తున్న వారికి ఉచిత ఆహారం, సరుకులు పంపిణీ చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను డైలీ ఒక పట్టిక రూపంలో విడుదల చేస్తున్న విజయ్ ఫౌండేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు అనేకమంది ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా విజయ్ దేవరకొండ నిజంగా బంగారు కొండ అంటూ ఆయనకు కితాబిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: