అక్కడ బన్నీ, ఇక్కడ మహేష్ దున్నేస్తున్నారుగా....!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు నటించిన తాజా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు ఇప్పటికే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి టాక్ తోపాటు కలెక్షన్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటీవల వరుసగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు, ఒక్కసారిగా తన పంథాను మార్చి, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన సరిలేరు లో నటించడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాదించి ఉండడంతో ఇటీవల వచ్చిన అలవైకుంఠపురములో పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో ఆ సినిమా చాలా వరకు సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం ఆ సినిమా కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలు కూడా రూ. 100 కోట్లకుపై షేర్ ని కొల్లగొట్టడం జరిగింది. సంక్రాంతి సీజన్ కావడంతో ఇప్పటివరకు బాగానే రాబట్టిన ఈ సినిమాలకు ఇవాళ్టి నుండి అసలైన కలెక్షన్ టెస్ట్ ప్రారంభం కానుంది.
ఇక ఈ రెండు సినిమాల ఓవర్ ఆల్ కలెక్షన్ రిపోర్ట్ ని పరిశీలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు ఒకింత ముందుకు దూసుకెళ్తుండగా, అలవైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్ సాధిస్తోంది. అలానే రెండు సినిమాలు కూడా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి నేటి నుండి ప్రారంభమయ్యే ఈ కీలక టెస్ట్ లో ఏ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో, ఎవరి స్టామినా ఏంటో తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు......!!