సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, జియంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక మరొక సినిమా బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో షూటింగ్ జరుపుకుంటున్న అల వైకుంఠపురములో కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బన్నీ ఈ సినిమాలో ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నట్లు సమాచారం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు భారీ సినిమాల హక్కులను ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ జెమినీ టివి దక్కించుకున్న విషయం తెమిలిసిందే. ఇక ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన మెగాస్టార్ కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా హక్కులను కూడా తామే దక్కించుకున్నట్లు జెమినీ టివి వారు ప్రకటించడం జరిగింది. మొత్తం ఈ మూడు భారీ సినిమాల హక్కులను దక్కించుకుని జెమినీ టివి సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసినట్లయింది.
ఇటీవల తెలుగు సినిమాల హక్కులకు పలు ఛానళ్ల మధ్య పోటీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ మూడు సినిమాలకు జెమినీ వారు భారీ మొత్తంలో డబ్బులు చెలించినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె సుస్మిత స్టైలింగ్ విభాగంలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు......!!