తమిళ స్టార్ సూర్య తన సినిమా కెరీర్ పరంగా చేసే ప్రయోగాలు మరొక స్టార్ హీరో ఎవరూ కూడా చేయలేరని అంటుంటారు సినీ విశ్లేషకులు. ఆయన ఏ సినిమాకు ఆ సినిమా, ఎంతో వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడం వల్లనే తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ మరియు క్రేజ్ వచ్చిందని వారు అంటున్నారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని సూర్య, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ముందుగా రిలీజ్ అవుతోంది, కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన బందోబస్త్. తమిళ్ లో కాప్పన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఎన్ఎస్జీ కమాండర్ గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారు.
సూర్య సరసన అఖిల్ మూవీ ఫేమ్ సాయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్య ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్, మాదాపూర్ ప్రాంతంలోని ఐటిసి కొహెనూర్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. తనకు గతంలో వీడోక్కడే, బ్రదర్స్ వంటి మంచి సినిమాలు అందించిన కెవి ఆనంద్ గారు, ఈ సినిమాతో మూడవ విజయాన్ని తప్పక అందిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు సూర్య. ఇక ఈ వేడుక అనంతరం ఇక్కడి మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడిన సూర్య, మన టాలీవుడ్ హీరోలు, మరియు ప్రేక్షకుల గురించి ఎంతో గొప్పగా చెప్పారట.
తనకు మహేష్, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ తదితర అందరు హీరోలతో మంచి స్నేహం ఉందని చెప్పిన సూర్య, తనకు అవకాశం వస్తే, త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో తప్పక నటిస్తానని అన్నారట. మొదటి నుండి తన సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు అంటే తనకు ఎనలేని అభిమానమని, అందుకే తన సినిమా వేడుకలు ఎప్పటిప్పుడు హైదరాబాద్ లో కూడా జరుపుకోవడానికి తాను ఎంతో ఇష్టపడతానని సూర్య చెప్పారట. కేవలం ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా తెలుగు ప్రేక్షకులపై ఎంతో అభిమానాన్ని చూపిస్తూ మాట్లాడే సూర్యపై, అలానే ఆయన సినిమాలపై, మన వాళ్ళు కూడా ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ ఆదరిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.....!!