మెగాస్టార్ నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా అప్పీల్ తో రానున్న ఈ సినిమా, తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ కానుండగా, అప్పుడే ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏర్పాట్లు షురూ చేసినట్లు సమాచారం. మొదట ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో చేద్దామని భావించారట,
అయితే కొన్ని అనివార్య కారణాల వలన అక్కడినుండి కర్నూలుకు మార్చినట్లు సమాచారం. ఇక ఈ వేడుక కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారట నిర్మాత రామ్ చరణ్. అత్యధిక మంది మెగా ఫ్యాన్స్ హాజరయ్యేలా వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారట, అంతేకాక బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ నుండి పలువురు నటులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం. ఇక మన టాలీవుడ్ నుండి మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు విశిష్ట అతిథిగా విచ్చేసి, వేడుకను మరింత ఆనందమయం చేయనున్నారట. అయితే ఈ వేడుక విషయమై ఇప్పటికే పవన్ ను కలిసి చిరంజీవి, రామ్ చరణ్ ఆహ్వానించినట్లు సమాచారం.
ఇక నేటి ఉదయం నుండి ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, దీనిపై సైరా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా, కీలకమైన పాత్రల్లో జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క శెట్టి, కొణిదెల నిహారిక తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చేనెల 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ....!!