మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి చెందిన తొలితరరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తెలుగు సహా తమిళ్, మలయాళం, హిందీ వంటి పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుదీప్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు సహా ఆయా భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా హిందీ హక్కులను భారీ రేటుకు ఇటీవల అమ్మడం జరిగింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విషయమై సైరా టీమ్ కు రెండు రకాల భయాలు లోలోపల వెంటాడుతున్నట్లు నేడు ఫిలిం నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముందుగా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ అయిన సాహో సినిమా, మొదటి మూడు రోజులు కూడా వరుసగా సెలవలు కావడంతో బాగానే కలెక్షన్ ను రాబట్టిందని,
అయితే ఆ తరువాత మొన్నటి నుండి ఆ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్ తగ్గుదల చూసి ఇపుడు సైరా నిర్మాతల్లో భయం పట్టుకుందని అంటున్నారు. నిజానికి సాహో పై పెట్టుకున్న అంచనాలు తలక్రిందలు చేస్తూ ఆ సినిమా నెగటివ్ టాక్ సంపాదించడంతో, అక్కడ ఆ సినిమాను కొన్న నిర్మాతలు కొంత ఆలోచనలో పడ్డట్లు చెప్తున్నారు. ఇక వచ్చేనెలలో రిలీజ్ కానున్న తమ సైరా సినిమాపై కూడా అక్కడి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడంతో, వాటిని ఎంతవరకు సైరా అందుకుంటుంది అనే అనుమానం వారిలో మొదలయిందట. ఇక మరీ ముఖ్యంగా, సరిగ్గా సైరా రిలీజ్ రోజునే హృతిక్, టైగర్ ష్రాఫ్ ల వార్ సినిమా రిలీజ్ కూడా ఉండడం, అదీకాక హృతిక్, టైగర్ లకు అక్కడ యూత్ లో మంచి క్రేజ్ ఉండడం వలన, ఎక్కువగా అక్కడి ప్రేక్షకుల ఫోకస్ వార్ పైనే ఉందని,
కాబట్టి సైరా ఏ మాత్రం ఆశించిన రేంజ్ లో లేకపోయినా, దానివల్ల వచ్చే నష్టం ఊహించలేమని భయపడుతున్నారట. ఇక ఈ రెండు కారణాల రీత్యా సైరా నిర్మాతలకు కొద్దిరోజులుగా భయం వెంటాడుతోంది అనేది ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త యొక్క సారాంశం. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం ప్రక్కన పెడితే, భారీ ఖర్చుతో మరియు విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సైరా సినిమా, రేపు రిలీజ్ తరువాత ఆ అంచనాలు అందుకోకపోతే మాత్రం, బయ్యర్లు ఎంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సైరా అక్టోబర్ 2న రిలీజ్ తరువాత, ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి......!!