టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. బన్నీ సరసన గతంలో డీజే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, ఈ సినిమాలో మరొక్కసారి ఆయనతో జోడి కడుతోంది. యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు.
అజ్ఞాతవాసితో భారీ డిజాస్టర్ ని చవి చూసిన త్రివిక్రమ్, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్ళి మంచి ఫామ్ లోకి రావడం జరిగింది. ఇక ప్రస్తుతం బన్నీతో చేస్తున్న ఈ సినిమాను కూడా మంచి హిట్ చేయాలనే తలంపుతో త్రివిక్రమ్ సహా యూనిట్ మొత్తం కూడా ఎంతో కష్టపడుతోందట. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సినిమా యూనిట్, రేపు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నట్లు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.
టాలీవుడ్ లో ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు, తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాటి చెప్పే విధంగా మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. డీజే, నా పేరు సూర్య సినిమాలతో కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డ బన్నీ, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే బన్నీ ఫ్యాన్స్ సహా, టాలీవడ్ ప్రేక్షకులందరి లోను మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు...!!