హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు ఈ సారి టఫ్ ఫైట్ తప్పదా?

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సత్యవేడు కూడా ఒకటి. మొదట నుంచి సత్యవేడులో టి‌డి‌పికి అనుకూల ఫలితాలు వచ్చేవి. ఇప్పటివరకు సత్యవేడులో టి‌డి‌పి అయిదుసార్లు విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ టి‌డి‌పిదే విజయం. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. వైసీపీ తరుపున కోనేటి ఆదిమూలం అదిరిపోయే మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక ఎమ్మెల్యేగా ఆదిమూలం తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. సత్యవేడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సత్యవేడులో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వాటర్ ట్యాంకులు, సి‌సి రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పేదలకు అన్నీ వసతులతో జగనన్న కాలనీల్లో ఇళ్ళు నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు నాడు-నేడు కార్యక్రమం ద్వారా సత్యవేడులోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సజావుగా అందుతున్నాయి. నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి కొరత ఉంది. అటు సాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. సత్యవేడులో రోడ్ల సౌకర్యం కూడా సరిగ్గా లేదు. కాళంగి, ఉబ్బలమడుగు ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు సరిగ్గా జరగడం లేదు. సత్యవేడులో పర్యాటకులను విశేషంగా ఆకర్షించగలిగే ఆధ్యాత్మిక, భౌగోళిక విశేషాలున్నా అవి అభివృద్ధికి, ప్రాచుర్యానికి నోచుకోవడం లేదు.

 
రాజకీయంగా వస్తే ఆదిమూలం పనితీరు బాగానే ఉండటం వల్ల, వైసీపీ బలంగానే ఉంది...అదే సమస్యలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. అటు టి‌డి‌పి తరుపున రాజశేఖర్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీని బలోపేతం చేసుకోవడానికి చూస్తున్నారు. సత్యవేడు టి‌డి‌పి కంచుకోట కాబట్టి ఎమ్మెల్యే ఆదిమూలం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: