అరటి పండు తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?
"రోజుకొక ఆపిల్ పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి! డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు!" అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇపుడు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే? రోజుకొక ఆపిల్ పండు తినడం అందరికీ సాధ్యపడే పనికాదు కాబట్టి రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించొచ్చు... అని చెబుతున్నారు. అవును, వాస్తవమే... అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా మనిషి అనేక రోగాల బారి నుంచి బయటపడొచ్చు.
వంద గ్రాముల బరువు కలిగిన అరటి పండుని తీసుకుంటే, దానిలో 0 శాతం కొవ్వు, 0 శాతం కొలెస్ట్రాల్, 2.6 గ్రాముల పీచు, 258 మిల్లీగ్రాముల పొటాషియం, 20 శాతం విటమిన్ B6, 14 శాతం విటమిన్ సి, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, బాగా పండిన అరటి పండులోని పోషకాలు సాధారణ అరటి పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే, అరటి పండు పక్వానికి వచ్చే కొలది.. సాధారణ చక్కెరలా మార్పులకు గురవుతుంది కాబట్టి. అయితే, క్యాలరీల సంఖ్య మాత్రం తగ్గదు. ఇంకా గోదుమ రంగు మచ్చలు ఉండే అరటి పండులో తగిన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు.
అందుకే అరటి పండు తీసుకున్నవారు మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, అజీర్తి, క్యాన్సర్, జీర్ణ సమస్యల నుండి రక్షింపబడతారు. ఇంకా అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది ఎముకలు, దంతాలకు మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వారానికి 2-3 అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని తాజా సర్వేలు చెబుతున్నాయి. అరటి పండ్లు కణ నష్టాన్ని కూడా నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ వల్ల అంతర్గత, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటి పండు ఉపయోగపడుతుంది. వ్యాధులబారిన పడకుండా రక్షిస్తుంది.