జాతీయ పార్టీగా జ‌న‌సేన‌.. తెర‌వెన‌క చ‌క్రం తిప్పుతోందెవ‌రు...?

RAMAKRISHNA S.S.
జనసేన పార్టీని జాతీయ పార్టీగా మార్చుతానని ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. “వచ్చే పది సంవత్సరాల్లో అన్నీ అనుకూలిస్తే, జనసేన తప్పకుండా జాతీయ పార్టీగా అవతరిస్తుంది” అని ఆయన స్పష్టంగా చెప్పడం, ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధమవుతున్నాయన్న సంకేతాలిచ్చారు. అయితే, అసలు జనసేన జాతీయ పార్టీగా అవతరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమైన ప్రశ్న. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీగానే నమోదు అయ్యింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో టీడీపీకి సభ్యత్వం ఉన్నా అక్కడ పార్టీ యాక్టివ్‌గా లేదు. ఏపీలోనే బలాన్ని నిలుపుకోవడంలో టీడీపీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చూపడం చాలా కష్టం అయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనను జాతీయ స్థాయిలో విస్తరింపజేయాలన్న సంకల్పం వ్యక్తం చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


ఇందులో కీలకంగా కనిపిస్తున్న అంశం బీజేపీ వ్యూహం. బీజేపీకి బలహీన స్థితిలో ఉన్న రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన ప్రాంతీయ పార్టీలను ముందుకు తేవడం అనే రాజకీయ గణితం చాలాకాలంగా కొనసాగుతోంది. గడచిన దశాబ్దాల్లో అసోం గణ పరిషత్‌ వంటి ఉదాహరణలు ఈ దిశగా నిలిచాయి. ఇప్పుడు అదే మార్గంలో జనసేనను బీజేపీ ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల నుంచే జనసేన తన పాదం మోపే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం, అక్కడ కొత్త సమీకరణాలు వెలువడడం వంటి అంశాలు జనసేన విస్తరణకు బీజం వేయగలవని అంటున్నారు.


ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశం కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాల్లోనే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపాల‌న్న త‌ప‌న ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టడం సహజంగానే తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడం కష్టమైన పని అయినా, ఆ దిశగా పవన్ ప్రయత్నాలు సఫలమైతే, తెలుగు నేలపై ఆవిర్భవించిన జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: