రేవంత్ తప్పులన్నీ బయటపెట్టిన బండి సంజయ్.. ఇదిగో లిస్టు?
ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారని.. కానీ.. అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసమని బండి సంజయ్ అన్నారు. మీ ఏడాది పాలనా నిర్వాకంవల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి.. మీ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలందక పేదలు అల్లాడుతున్నారు.. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారన్నారు.
గత బీఆర్ఎస్ తోపాటు మీ ప్రభుత్వ నిర్వాకంవల్ల రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయన్న బండి సంజయ్.. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు మూతపడే దుస్థితి ఉందన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. మీ చేతగానితనం, నిర్లక్ష్యంవల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్న బండి సంజయ్.. సుమారు రూ.380 కోట్ల మేరకు చెల్లిస్తామని టోకెన్లు జారీ చేసి నెలలు గడిచినా చెల్లింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ పద్ధతిలో క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గు చేటు అన్న బండి సంజయ్.. అవేమైనా బ్యాంకు లోన్లా? వడ్డీలతో కలిపి బకాయిలు పెరిగిపోతే వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి?.. ఇవ్వాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా... ఓటీఎస్ పేరుతో కోత విధిస్తామని చెప్పడం దుర్మార్గం..పేదలకు విద్య, వైద్యం అందించే విషయంలో మీరు చేతులెత్తేయడం దారుణమని బండి సంజయ్ మండిపడ్డారు.