వైసీపీ ని ప్రజలు పట్టించుకోవడం లేదా..?

ఏపీలో వైసీపీ తీరు ఎలా ఉంది అన్నది ఒక చర్చగా సాగుతోంది.  వైసీపీ 151 సీట్లతో అధికారం చలాయించే రోజులలో విపక్షాలు అన్నీ గట్టిగా టార్గెట్ చేసేవి.  అలా వైసీపీ మీద పొలిటికల్ గా ఫుల్ ఫోకస్ ఉండేది.  ఇక గడచిన ఏడు నెలలుగా చూస్తే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.  ఏపీలో వైసీపీ అటు అసెంబ్లీలో తన వాణిని వినిపించడం లేదు.


దానికి కారణం వైసీపీ అధినాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తోంది అన్నది పక్కన పెడితే వైసీపీ వాయిస్ మాత్రం అసెంబ్లీలో ఎక్కడా వినిపించడం లేదు. ఇది ఒక విధంగా జనానికి దూరం చేసేదిగానే ఉంది అని అంటున్నారు. ఇక జనంతో అయినా పార్టీ కనెక్ట్ అయి ఉందా అంటే ఎక్కడికక్కడ నేతలు సైలెంట్ అయ్యారు. చాలా మంది కూటమి వైపు చూస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.


2014 నుంది 2019 మధ్యలో వైసీపీ విపక్షంలో ఉంది. ఆనాడు ఓటమి చెందినా డే వన్ నుంచే జగన్ జనంలో ఉంటూ వచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడా బలమైన విపక్షంగా వైసీపీ నిలిచి నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. అప్పటికి జగన్ కి అసెంబ్లీ అనుభవం కానీ విపక్ష నేత పాత్ర కానీ కొత్త. దాంతో టీడీపీ పెద్దలు ఆయనను లైట్ తీసుకున్నా వారి అంచనాలను సైతం మించి ఖంగు తినిపించారు.


ఇపుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.   జగన్  ఉంటే తాడేపల్లి లేకుంటే బెంగళూరు అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏడు నెలల కాలంలో జనంలోకి వచ్చింది బహు తక్కువ అని కూడా అంటున్నారు. ఇక వైసీపీలో జగనే సర్వస్వం. ఆయన జనంలోకి వస్తేనే పార్టీ క్యాడర్ లీడర్లు రోడ్డు మీదకు వస్తారు.


ప్రజా సమస్యలను అసెంబ్లీ లోపలా బయటా చర్చకు పెట్టడంలో విపక్షంగా వైసీపీ విఫలం అయింది అని అంటున్నారు. దాంతోనే వైసీపీ ని జనాలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే ప్రజలు వైసీపీని పట్టించుకోవడం లేదు అని ఘాటైన విమర్శ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: