తెలంగాణ బీజేపీ కి కొత్త బాస్ లు వస్తున్నారు..! రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అంటే..?

కాషాయం పార్టీలో రానున్న కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో సంస్థాగత మార్పులు చోటు చేసుకోనున్నాయి.  బీజేపీలో కొత్త సంవత్సరంలో అంతా కొత్తదనం సంతరించుకునేలా ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నూతన అధ్యక్షుల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. జనవరి నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ముందుగా జిల్లా అధ్యక్షుల నుంచి షురూ చేయనుంది.  



జనవరి 10లోగా ఆయా జిల్లాల అధ్యక్షులు, 15 వరకు రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసి నెలాఖరులోగా జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నుంచి నివేదిక రూపంలో వివరాలు సేకరించింది.


బీజేపీలో ఒకప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అంతగా పోటీ ఉండేది కాదు.  ఒకరిద్దరి పేర్లను పరిశీలించి నిర్ణయించేవారు.  ఇప్పుడా పరిస్థితి లేదు.  పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధిష్టానం ఇతర పార్టీల్లోని కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించింది.  ఆ సమయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చాలా మందికి హామీ ఇచ్చింది.  అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని సీనియర్లకు కాషాయ కండువా కప్పింది. ఇప్పటికే పలువురికి కీలక బాధ్యతలు సైతం అప్పగించింది.  అయితే కొంతమంది మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేశారు.  ఇప్పటికే అధిష్టానంను కలిసి తమకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.


పార్టీకి రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభలోనూ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరిగింది. 8మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలు ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు. రాష్ట్ర, జాతీయస్థాయికి చెందిన సీనియర్లు సైతం పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించేది ఆసక్తిగా మారింది.  


ప్రధానంగా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందర్‌రెడ్డి, అరవింద్‌ వంటి తదితర సీనియర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీసీ కోటా నుంచి చూస్తే రాజేందర్‌కు మహిళా కోటా నుంచి అయితే అరుణకు దక్కవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: