బాబు ప్రతీకారం పీక్స్.. జగన్ ఐదేళ్లు తట్టుకుంటాడా?
వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు అంటే రాబోయే ఏడు నెలలు కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కోసం దానిలో కేటాయింపులు, ఇతర పథకాల వంటి వాటిని చర్చించడం జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు బడ్జెట్ సమావేశాల పేరుతో కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా బడ్జెట్ సమావేశాల పేరుతో శ్వేత పత్రాలపై చర్చించిన దాఖలాలు లేవు.
తొలిసారి ఏపీలో మాత్రమే ఇలా జరిగింది. పోనీ ఎక్కడైనా సరైన విధంగా జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపారా అంటే అదీ లేదు. లిక్కర్ విషయాన్ని తీసుకుంటే ఆదాయం తగ్గిందని సుమారు రూ.18 వేల కోట్లు పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. అదే విధంగా చూసుకుంటే దుకాణాల సంఖ్య కూడా 2019తో 2020ని పోల్చితే సుమారు 30 వేల దుకాణాలు లేపేశారు. వాస్తవానికి ఇది శుభ పరిణామం. కానీ దీనిని నెగిటివ్ గా చిత్రీకరించారు.
దీంతో పాటు ఎన్నికలకు ముందు రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని పదే పదే ఆరోపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్వేత పత్రంలో నిజాలనే ఒప్పుకోవాల్సి వచ్చింది. జగన్ చేసిన అప్పులు కేవలం రూ.5 లక్షల కోట్లు మాత్రమే అని తేలింది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలను జగన్ ని డైల్యూట్ చేయడానికే వినియోగించారు. దీంతో పాటు ఏబీఎన్ రాధాకృష్ణ జగన్ విషయంలో చంద్రబాబుకి మరో సూచన చేశారు. జగన్ రెడ్డి లాంటి వాళ్లను రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా చంద్రబాబు తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. తాజా అంశాలను పరిశీలిస్తే.. జగన్ ని రాజకీయంగా డైల్యూట్ చేసే కార్యక్రమాలు జరగుతున్నాయి. మరి జగన్ వీటిని ఎలా తట్టుకొని రాబోయే ఐదేళ్లు ఎలా నిలబడతారో చూడాలి.