కర్ణాటక ఫెయిల్యూర్.. చంద్రబాబు క్యాష్‌ చేసుకుంటారా?

భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ రంగంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడం, ప్రైవేట్ రంగం వేగంగా విస్తరించడంతో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో కార్పొరేట్ పన్ను శాతమే ఎక్కువ. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన కోసం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు ఇచ్చే పన్నులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

మరోవైపు ఎన్నికల్లో ప్రైవేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపై రాజకీయ పార్టీలు ఆధారపడుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో వివాదస్పద ఉద్యోగ రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక సర్కారు ఓకే చెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో తాత్కాలికంగా దీనిని వాయిదా వేయాలని సిద్ధరామయ్య సర్కారు నిర్ణయించింది. బిల్లును పునః సమీక్షించి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని సీఎం సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ప్రైవేట్ రంగం సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగుల రిజర్వేషన్లు క్పలించేందుకు ఆమోదించిన బిల్లును నిలిపివేస్తున్నట్లు సీఎం సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.

ఈ వివాదం తాత్కాలికంగా సద్దు మణిగినా.. బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిని అవకాశంగా మలుచుకున్న ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధనలు, పరిమితులు లేవని.. అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని 24 గంటల విద్యుత్తు సౌకర్యం ఉందని లోకేశ్  పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఏపీకి చెందిన చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.  తెలంగాణ, బెంగళూరులో ఏపీ వ్యక్తులు పెట్టిన పెట్టుబడులే ఎక్కువ. సీఎం చంద్రబాబు వీరందరితో మాట్లాడి.. సరైన ప్లాట్ ఫాం కల్పించి పెట్టుబడులు ఏపీలో పెట్టేలా ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు.  విశాఖ, అమరావతి, కర్నూలు, తిరుపతి, కాకినాడ ఇలా పెట్టుబడులకు అనుకూల నగరాలు చాలా ఉన్నాయని పేర్కొంటున్నారు.  తద్వారా  మన రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా పన్నుల రూపంలో డబ్బులు కూడా వస్తాయని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: