దేశాన్ని విభజిస్తోంది.. బీజేపీనా.. కాంగ్రెస్సా?

కాలం మారింది. ప్రజల మైండ్ సెట్ లోనూ మార్పు వచ్చింది. కొన్ని అంశాలకు సంబంధించి వీలైనంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.  గతంలో ఇరు ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించి.. ఆ తర్వాత తామే వాటిని పరిష్కరించామని గొప్పలు చెప్పుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడింది.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రజలు అంత సులభంగా దేనిని నమ్మడం లేదు. పైగా ఓటర్లు తెలివిగా ఉన్నారు.

ఇంత టెక్నాలజీ సమయంలో కాంగ్రెస్ ఇంకా పాత రాజకీయాలనే చేస్తుంది.  కన్నడ ప్రజల కోసం చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ల ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలో కన్నడ వాసులకే ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని.. దీనిని సరిదిద్ధాలనే తమ ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు.

కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ముందుకు తీసుకువచ్చిన సిద్ధూ సర్కారు.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో వెనక్కి తగ్గారు.  అదే సమయంలో బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ కు జరగాల్సిన నష్టం జరిగిందనే వాదనలు ఉన్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాంతం.. కులం.. మతం లాంటి అంశాలకు ఎంత దూరంగా ఉంటే కాంగ్రెస్ కు అంత మంచింది.

ఉదాహరణకు తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో పలు రాష్ట్రాల వాళ్లు బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, యూపీలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు పని చేస్తుంటారు. వీరందరినీ వెనక్కి పంపిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహిస్తే చాలు. దీని తీవ్రత అర్థం అవుతుంది. పైగా కాంగ్రెస్ జాతీయ పార్టీ. అంటే దేశ వ్యాప్తంగా ప్రజలను సంఘటితం చేయాలి. కానీ ప్రాంతాల వారీగా ప్రజలను విభజిస్తే.. భవిష్యత్తులో ఆయా రాష్ట్రాల మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఏ ప్రాంతం వారు అక్కడే ఉండాలంటే ఇక భారత దేశం ముక్కలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాలానికి తగినట్లు కొన్ని అంశాల విషయంలో కాంగ్రెస్ మారాల్సిన అవసరం ఉంది. ఇంకా పాత పద్ధతిలోనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తామంటే ఇలానే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: