పవన్‌ కల్యాణ్‌.. పచ్చని కోనసీమలో.. ఏమిటీ సంక్షోభం?

పచ్చటి ఆకులతో, పరుచుకున్న అందాలతో కళకళలాడుతున్న కొబ్బరి తోటలు ఎండిపోయి మొండి దూలాల్లా దర్శనమిస్తున్నాయి. కోనసీమ కొబ్బరి తోటలు కొందరి స్వార్థానికి బలవుతున్నాయి. తోటలను ఆనుకొని ఉన్న కాలువలు, ఆక్రమణలు, ఎగదన్నుతున్న సముద్రపు నీరు రైతన్నల కడుపు కొడుతున్నాయి. డాక్టర్ బీఆర్ఎ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో తీర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లోని దాదాపు లక్ష కొబ్బరి చెట్లు.. రూపాన్ని కోల్పోయి మోడుబారి నిటారుగా కనిపిస్తున్నాయి.

కోనసీమ కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం ప్రాంతంలో ఉన్న 23 కిలో మీటర్లు శంకర గుప్తం మేజర్ డ్రెయిన్, సమాంతరంగా సుమారు 8 కి. మీటర్లు మేర విస్తరించిన గోగన్న మఠం డ్రెయిన్లు తీర గ్రామాల పాలిట శాపంగా మారాయి.

గోగన్న మఠం డ్రెయిన్ ఆక్రమణకు గురి కావడంతో సముద్రపు ఆటు పోట్లకు వచ్చే ఉప్పు నేరుగా శంకర గుప్తం మేజర్ డ్రెయిన్ లోకి చేరుతుంది. మేజర్ డ్రెయిన్ గట్లపైకి ఈ నీరు పొంగి తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. 30 మీటర్లు వెడెల్పు ఉన్న గోగన్న మఠం డ్రెయిన్ ఆక్రమణల ఫలితంగా ప్రస్తుతం మూడు మీటర్లకు కుచించుకుపోయింది. ఆక్రమణలు తొలగిస్తేనే ఉప్పు నీటి సమస్య తీరుతుంది. రైతుల విజ్ఞప్తి మేరకు దెబ్బతింటున్న తోటలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.

డ్రెయిన్ లో ఉప్పు నీరు తోటల్లోకి ఎక్కకుండా గట్లను ఎత్తు చేసి పటిష్ఠపరచడానికి సీఎస్ ఆర్ నిధుల నుంచి రూ.2.11 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు రాకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మారింది. ప్రస్తుతం తీరంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థమైనందున ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోపోతే  తీరంలోని గ్రామాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. సముద్రపు నీరు డ్రెయిన్ల ద్వారా విస్తరించడంతో భూ గర్భ జలాలు కలుషితం అయి తాగుకు, సాగుకు పనికిరాకుండా అవుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన విపత్తు ఈసారి మరింత విషమ పరిస్థితులను తెచ్చి పెట్టింది. ప్రభుత్వం సత్వరమే స్పందించి డ్రెయినేజీ వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: