జగన్‌ను చూసి.. చంద్రబాబు జాగ్రత్త పడుతున్నాడా?

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇటీవల ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. పారదర్శకంగా, ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేలా వ్యవహరించాలని మంత్రులకు సూచించారు.  అక్టోబరు తర్వాత ఇసుక రీచ్ లన్నీ అందుబాటులోకి వస్తాయని నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని వివరించారు. ఇక కొత్త మంత్రులు త్వరగా తమ శాఖలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం. ఈ మేరకు కేబినెట్ భేటీలో పలు కీలక సూచనలను మంత్రులకు సూచించారు.

లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి. శాఖల సంబంధిత అంశాలపై ప్రతి నెలా సమీక్షలు జరపాలి. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నాం. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. పంటలు బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు.

అయితే ఇసుక విధానంలో వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగింది. స్థానిక నేతల ప్రమేయంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇసుక రీచ్ ల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై ప్రజల్లో ఆగ్రహం  వ్యక్తం అయింది. అందుకే చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా… మంత్రులను హెచ్చరించినట్లు కనిపిస్తోంది. వైసీపీ చేసిన తప్పులు చేయకపోవడం ద్వారా ప్రజల అభిమానాన్ని మరింత చూరగొచ్చనేది ఆయన అభిప్రాయం. మరి టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: