చంద్రబాబు వస్తున్నాడు.. రేవంత్‌ రెడ్డీ జర జాగ్రత్త?

చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తున్నాడు. అదేంటి ఆయన ఉండేది సగం రోజులు హైదరాబాద్‌లోనే కదా అంటారా.. అది వేరు.. ఇప్పుడు ఆయన వచ్చేది ఏపీ సీఎం హోదాలో.. ఇంతకీ వచ్చేది ఎక్కడికి.. ఈసారి ఏకంగా తెలంగాణ సీఎం చంద్రబాబు వద్దకే.. ఆయనతో ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యలు చర్చించేందుకు. మంచిదే కదా అంటారా.. నిజంగా మంచిదే.. ఉమ్మడి ఏపీ విడిపోయి పదేళ్లయింది. ఇంకా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏంటి.. కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా.

ఏపీకి మళ్లీ సీఎం కాగానే చంద్రబాబు కూడా ఇదే అనుకున్నాడు. ఎలాగూ తెలంగాణలో తన శిష్యుడైన రేవంత్ రెడ్డే సీఎంగా ఉన్నాడు.. కాబట్టి చర్చలకు వెళ్లడంలో మొహమాట పడాల్సిన అవసరం లేదు. గతంలో అంటే కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. ఆయనతో చర్చలంటే కాస్త ఇగో అడ్డు వచ్చేదేమో.. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. నిజంగానే చంద్రబాబుకు సమస్య లేదు. కానీ సమస్య ఉన్నదల్లా రేవంత్ రెడ్డికి మాత్రమే. ఆయనకు మాత్రం ఏం సమస్య అంటారా.. ఒకటి కాదు.. రెండు కాదు.. చంద్రబాబుతో చర్చలు అంటే రేవంత్ రెడ్డి చాలా సమస్యలు ఉన్నాయి.

ఆ సమస్యల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. రేవంత్ రెడ్డిపై ఉన్న చంద్రబాబు శిష్యుడు అన్న ముద్ర. ఆ ముద్ర వల్ల.. చర్చల్లో రాష్ట్రం మేలు కోసమే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని బూతద్దంలో చూపేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి. ఇంకేముంది.. ఈ రేవంత్ రెడ్డి.. చంద్రబాబుపై ఉన్న ప్రేమతో రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టేస్తున్నాడహోఅంటూ ప్రచారం చేసేస్తాయి. అందువల్ల రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి అడుగులు వేయాలి.

అందులోనూ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నవి చాలా సున్నితమైన సమస్యలు. వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాలు పెద్ద మనసు చేసుకుని ఆలోచించుకోవాలి. కానీ.. సీనియార్టీ రీత్యా చంద్రబాబు రేవంత్ రెడ్డిని కొంత డ్యామినేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించాడు. చంద్రబాబు ఉద్యోగం చంద్రబాబుకు ఉంది.. నా ఉద్యోగం నాకు ఉంది.. చంద్రబాబు కోసం నా ఉద్యోగానికి ఎసరు పెట్టించుకుంటానా అన్నాడు రేవంత్‌ రెడ్డి. ఈ సోయి.. రేవంత్ రెడ్డికి చర్చల ఆసాంతం ఉండాలి. లేకపోతే.. ఆయనకు తాటాకులు కట్టేందుకు కేసీఆర్‌ బ్యాచ్‌ రెడీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: