రేవంత్‌రెడ్డి.. జగన్‌రెడ్డిలానే వన్‌టైమ్‌ వండర్‌ అవుతాడా?

రేవంత్‌ ముందు సవాళ్లెన్నో?
సొంత పార్టీలోనే ఎన్నో గ్రూపులు..
అదను కోసం కాచుకున్న బీజేపీ, బీఆర్ఎస్‌..
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఏడాది క్రితం వరకూ ఈ మాట అంటే ఎవరైనా నవ్వుకునే వారు.. అది అయ్యే పనేనా అనుకునేవారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ పేరు కాకుండా ఇంకో పేరు ఊహించుకునేవారు కూడా కాదు. అలాంటిది ఏడాదిలో సీన్ మారిపోయింది. రెండు, మూడేళ్ల వరకూ అసలు తెలంగాణలో పెద్దగా బజ్‌ లేని కాంగ్రెస్‌కు ఊపు తీసుకొచ్చి.. ఏకంగా అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు ఉన్నారా అనే స్థాయి నుంచి.. ఏకంగా అధికారంలోకి తెచ్చి సీన్ మార్చేశాడు రేవంత్ రెడ్డి.

మరి అలాంటి రేవంత్ రెడ్డి.. తన పాలనలో వండర్స్ చేస్తారా.. ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేస్తాడా.. మరోవైపు కాచుకుని కూర్చున్న బీజేపీని నిలువరించగలడా.. అధికారం కోల్పోయి బలహీనమైన బీఆర్‌ఎస్‌ ను పూర్తిగా నిర్వీర్యం చేయగలడా.. అంటే కాలమే సమాధానం చెప్పాలి.. అయితే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు. భవిష్యత్‌పై మంచి ప్రణాళిక ఉండటంతో పాటు రాజకీయాల్లో సాహసాలకు పాల్పడగలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి.

కానీ.. రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకోలేడు. ప్రతి విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పే చేయాలి. పార్టీలోనూ ప్రత్యర్థులు ఎందరో ఉన్నారు. దీనికి తోడు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులభం కాదు. పైగా గతంలో కేసీఆర్‌ చక్కటి పాలనే అందించారు. ఇప్పుడు రేవంత్‌కు అంతకుమించిన పాలన అందిస్తే కాదు.. మంచి మార్కులు రావు.

మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసుకుంది. అసెంబ్లీలో 8 స్థానాలే దక్కించుకున్న ఆ పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు దక్కించుకుంది. అంటే తెలంగాణలోని దాదాపు సగం స్థానాలు దక్కించుకుంది. అంటే ఆ పార్టీ భయంకరంగా ఎదుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఉంది. మరి ఇన్ని సమస్యలు అధిగమించి రేవంత్‌ రెడ్డి ప్రజలతో శభాష్ అనిపించుకోవడం అంత సులభం ఏమీ కాదు.. అలాగని అసాధ్యమూ కాదు. అందుకే ఆయన భవిష్యత్‌ ఆయన దక్షతపై ఆధారపడి ఉంటుంది. మరి రేవంత్ ప్రజలను మెప్పిస్తారా.. లేక.. జగన్‌లా వన్‌టైమ్‌ వండర్‌గా మిగులుతారా అంటే కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: