కేసీఆర్‌ పదేళ్లు ట్రై చేశారు.. కాలేదు.. రేవంత్‌ వల్ల అవుతుందా?

హైదరాబాద్‌లో రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూములు కొన్ని చోట్ల అడ్డంకులుగా ఉన్నాయి. ప్రత్యేకించి కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ.. చాలా వరకూ సమస్య అలాగే ఉండిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన ఢిల్లీలో ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు.

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్తర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్షణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కలిసి ఈ విషయంపై చర్చించారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్తర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు ర‌క్షణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్షణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్పగించాల‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ర‌క్షణ శాఖ భూముల ప‌ర‌స్పర బ‌దిలీకి అంగీక‌రించాల‌ని రక్షణ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు.

అలాగే వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధరించాల‌ని.. కుదరకపోతే తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: