ఏపీ అసెంబ్లీ: ఈసారి అలాంటి సీన్లు వద్దు.. ప్లీజ్‌?

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ్యులు ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఇక అసలు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక.. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏపీలో నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పోరు మరింత తీవ్రంకావడంతో అసెంబ్లీ అంటే అదేదో మాటల యుద్ధాలు, సవాళ్లకు వేదికగా మారుతోంది.

అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలపై చర్చించాలి. ప్రజలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం కావాలి. ప్రజల కోసం రూపొందించే చట్టాల్లో మంచి చెడ్డల గురించి కూలంకషంగా చర్చ జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించి.. వాటికి పరిష్కార మార్గాలు సూచించి.. వాటిని అమలు జరిగేలా చేయాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి.. వాటిని సవరించేలా చేయాలి. కానీ ఏపీ అసెంబ్లీలో ఎప్పుడు చూసినా విమర్శలు, సవాళ్లు, మాటల యుద్ధాలు తప్ప.. నిర్మాణాత్మకంగా చర్చ జరిగిందే ఉండదు.

ఈ విషయంలో తెలంగాణ కొంత వరకూ బెటర్‌గా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా రాజకీయ సవాళ్లు ఉన్నా.. చాలా వరకు చర్చలు అర్థవంతంగా జరుగుతాయి. అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుతుంటే సభ సజావుగా ఉంటుంది. ఎవరి వాదన వారు వినిపిస్తారు. కానీ.. ఇలాంటి దృశ్యాలు ఏపీ అసెంబ్లీలో కనిపించడం చాలా అరుదుగానే జరుగుతుంది. ఎన్నో చట్టాలు కనీస చర్చ కూడా జరగకుండానే ఆమోదం పొందుతుంటాయి. ఆ తర్వాత అదే చట్టాల అమలు సమయంలో మళ్లీ రచ్చ జరుగుతుంది.

అయితే.. ఈసారి వైసీపీ సభ్యులు కేవలం 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. అయినా సరే.. విపక్ష సభ్యులకు కూడా వారి వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. విపక్షం కూడా 11 మందితో మనం చేసేదేముంది అని కాకుండా.. సభ్యులు తక్కువగా ఉన్నా నాణ్యమైన చర్చలకు ఆస్కారం కల్పించాలి. ప్రభుత్వాన్ని సరైన అంశాలపై నిలదీయాలి. ఇదే ఇండియా హెరాల్డ్‌ ప్రజల తరపున కోరుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: