మోదీ.. అర్జంటుగా ఆ అంశంపై ఫోకస్ పెట్టకపోతే అంతే సంగతులు?
ఎన్నికల తర్వాత జరుగుతున్న దాడుల పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఓట్ల పోలరైజేషన్ జరిగింది. పశ్మిమ బెంగాల్, కశ్మీర్, మణిపుర్, అసోం, పంజాబ్, తమిళనాడు, కేరళలో ఓట్లు గంపగుత్తుగా ఇండియా కూటమి నేతలకు పడ్డాయి. ఈ రాష్ట్రాల్లోని ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోయింది. దీనికి కారణం బీజేపీలోని పలువురు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం.. ఓట్ల కోసం ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఏకంగా ప్రధాని మోదీ సైతం హిందువుల మంగళసూత్రాలను తీసుకెళ్లి ముస్లింలకు పెడతారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయా వర్గాల్లో ఒక రకమైన భయం ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడ ఇండియా కూటమి అభ్యర్థులు ఉంటే వారికి అనుకూలంగా ఓటేశారు. ఏ పార్టీ అయినా సరే వారు పట్టించుకోలేదు. బీజేపీ రావొద్దు అనే భావన వారిలో కనిపించినట్లు ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి.
పైన పేర్కొన్న ఆయా రాష్ట్రాలు దేశ భద్రతకు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఇవన్నీ సరిహద్దు రాష్ట్రాలే. ఇక్కడ కొంత మంది నాయకుల మాటలతో దేశంపై భక్తి తగ్గిపోతుంది. వారిలో అభద్రతా భావం, ఇతర చర్యల వల్ల దేశంపై మమకారం తగ్గి విద్వేషం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల ప్రజలు చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. క్రమంగా వీరంతా దేశం పట్ల నిర్లిప్తంగా ఉంటే భారత్ పెను సవాల్ ను ఎదుర్కోనుంది. పంజాబ్ లో ఖలీస్తానీలకు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారిలో భద్రతా భావాన్ని పెంచి భారతీయులంతా ఒక్కటే అనే భావనను కేంద్రం పెంపొందించాలి. మరి ప్రధాని మోదీ ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.