కలలాంధ్రప్రదేశ్: సినీరంగం తరలివస్తే బొమ్మ బ్లాక్‌బస్టరే?
కానీ భౌగోళికంగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో ఉన్నా.. టాలీవుడ్‌లో కీలక పాత్ర పోషించేవారంతా ఆంధ్రులే అన్న సంగతి తెలిసిందే. సినీరంగంపై ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రులది గుత్తాధిపత్యం. అందుకే తెలంగాణ ఏర్పడి పదేళ్లవుతున్నా.. అక్కడి ప్రభుత్వం సినీ ప్రముఖులను గౌరవిస్తూ పరిశ్రమను తరలించాలన్న ఆలోచన రాకుండా చేస్తోంది. కానీ.. ఎన్నాళ్లున్నా హైదరాబాద్ పొరుగు రాష్ట్రానిదే అన్న సత్యం సినీప్రముఖులకూ తెలుసు.
అందుకే.. ఏపీలో సినీరంగం అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే.. మంచి ప్రగతి కనిపిస్తుంది. సినీ పరిశ్రమ హెడ్ ఆఫీసులు అన్నీ హైదరాబాద్‌లో ఉండటం వల్ల.. సినీ పరిశ్రమ ద్వారా వచ్చే పన్ను లాభాలన్నీ తెలంగాణకే వెళ్తున్నాయి. ఏపీలో సినీరంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ ఆదాయాన్ని ఏపీ పొందవచ్చు.
అయితే సినీరంగం తరలింపు అంత చిన్న విషయం ఏమీ కాకపోయినా.. పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యమైన విషయం కూడా ఏమీ కాదు. ఇప్పటికే వైజాగ్‌లో కొందరు స్టూడియోలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వాలు భూములు కూడా కేటాయించారు. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి.. ఏపీకి సినీపరిశ్రమను తరలించే అంశంపై చర్చలు జరపాలి. ఏపీలోనూ సినీరంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఏపీలో షూటింగ్ జరుపుకునే చిత్రాలకు రాయితీలు ఇవ్వాలి. పాలకులు గట్టిగా తలచుకుని ఓ పక్కా ప్రణాళిక రూపొందిస్తే ఏపీలోనూ సినీరంగం విస్తరిస్తుంది. అందుకు కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. ఆ రోజులు త్వరలోనే రావాలని కోరుకుందాం.