ఇండియాలో ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?
ఇండియాలో ఓటు హక్కుకు మూలాలు స్వాతంత్ర్యానికి ముందే పడ్డాయి. 1907లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వేసిన 'రాయల్ కమిషన్' సిఫారసుల ఆధారంగా 1909 'కౌన్సిల్ చట్టం' భారతీయులకు మొట్ట మొదటి సారి ఓటు హక్కు వచ్చింది. అప్పట్లో ఈ ఓటు హక్కు కొందరికే ఉండేది. ఆ తర్వాత దీనిని మరింతగా విస్తృత పరిచి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ హక్కును 10.6 శాతానికి పెంచడం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్, ఎన్నికల సందర్భంగా 28.5 శాతం ప్రజలకు దీనిని పెంచారు.
చాలా దేశాల్లో అందరికీ ఓటు హక్కు లేదు. మన దేశంలో ప్రజలందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించడం మన రాజ్యాంగం గొప్పదనం. పేదోడైనా, ధనవంతుడైనా ఎవరైనా.. అందరికీ ఒకే ఓటు హక్కు. అందరి ఓటు విలువ ఒక్కటే. అదే భారత ప్రజాస్వామ్య గొప్పదనం. ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి మన రాజ్యాంగం ఇలా భారత పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఇచ్చింది.
మన దేశంలో అందరూ సమానులే. అందుకే ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి 352 అధికరణ ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతం, లింగ భేదాలు వంటి తేడాలతో ఏ ఒక్కరికీ ఓటు హక్కు నిరాకరించదు. మన రాజ్యాంగంలోని 326 వ అధికరణ ప్రకారం 'సార్వత్రిక వయోజన ఓటు హక్కు' పౌరులందరికీ లభించింది. మొదట్లో 21 ఏళ్లు వచ్చిన అందరికీ ఓటు హక్కు ఉండేది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. ఇదీ మన ఓటు హక్కు చరిత్ర.