చంద్రబాబు ఆఖరి అస్త్రం.. జగన్ తలరాత మార్చేస్తుందా?
ఇదే ఓట్ల పంటను పండిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఎంచుకున్న అంశం ఇదే. ఏప్రిల్ నెలాఖరు వరకు చప్పగా సాగిన ప్రచారాన్ని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశంతో ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది టీడీపీ. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ చట్టం వల్ల మీ భూములు మీవి కాకుండా పోతాయని.. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు ఊదరగొడుతూ జనాల్లోకి వెళ్తున్నారు.
దీనిని ఏ మేర జనాల్లోకి తీసుకెళ్లాలో.. అంతకు మించే ఎల్లో మీడియా తీసుకెళ్లింది. మొత్తం మీద టీడీపీ అనుకున్నట్లు ఒక వేవ్ ను అయితే తీసుకురాగలిగింది. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే టీడీపీ దీనిపై ఎప్పటి కప్పుడు దుష్ర్పచారం చేస్తూ.. కొత్త అంశాలను లేవనెత్తుతూ రాజకీయ లబ్ధి పొందుతుంది. మొన్నటి వరకు రిజిస్ర్టేషన్ పై ప్రచారం.. అవి అసత్యం అని తేలడంతో ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు.
డేటాను ఇతర దేశాలకు తరలిస్తున్నారని.. మన వ్యక్తిగత గోప్యతను ఇతరుల చేతిలో పెట్టారని విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడేమో క్రిటికల్ రివర్ కి కంపెనీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో రూ.100 కోట్లకు పైగా దోచిపెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే ఇది 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థ. చాలా నమ్మదగిన సంస్థ. అయినా దీనిపై కూడా చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇది డేటా చౌర్యం చేస్తుందని ఆరోపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.