అలా పవన్‌ చేసిన ప్రచారం.. ఎన్నికల తీరే మార్చేసిందా?

ఏపీలో ఎన్నికల ప్రచారం ఆఖరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియబోతోంది. ఈనెల ఎల్లుండి సాయంత్రానికి మైకులు మూగబోతాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఆయన జనసేన పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే కాకుండా కూటమి సభల్లోనూ పాల్గొని ఉత్తేజ భరితమైన ప్రసంగాలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు ఆసాంతం ఉత్సాహ భరితంగా సాగాయి. పవన్‌ కల్యాణ్‌ తన సహజ శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా జగన్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యక్తిగత సవాళ్లు బాగా హైలెట్ అయ్యాయి. జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపి తీరతానని.. జగన్‌ను దింపకపోతే.. తన పేరు పవన్‌ కల్యాణే కాదు.. నా  పార్టీ జనసేనే కాదు అంటూ పవన్‌ ఊగిపోతూ చేసిన ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి.

తాను పోటీ చేస్తున్న పిఠాపురంపై ఎక్కువగా ఫోకస్‌ చేసినా.. ఇతర ప్రాంతాల్లోనూ పవన్ పర్యటించారు. ప్రత్యేకించి కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలకు హాజరయ్యారు. మోడీ, అమిత్‌ షా హాజరైన సభలకూ పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. చివరి దశలో విజయవాడలో మోదీతో రోడ్‌షోలో పాల్గొన్నారు.

అయితే.. పవన్‌ కల్యాణ్‌ ప్రచారం అనుకున్నన్ని ఎక్కువ రోజులు జరగకపోవడం కొంత నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. అందుకు పవన్‌ కల్యాణ్ ఆరోగ్యం సహకరించకపోవడం కూడా ఓ కారణం. మొదట్లో జ్వరం ఆయన్ను ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కాలి బొటనవేలుకు అయిన గాయం కొంత ఇబ్బంది పెట్టింది. జ్వరం, గాయాల కారణంగా మధ్యలో కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రచారం కూడా సాయంత్రం వేళల్లోనూ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు పవన్‌ కల్యాణ్. మొత్తం మీద.. వైసీపీపై చెలరేగిపోతూ పవన్‌ కల్యాణ్ చేసిన ప్రసంగాలతో కూటమి ప్రచారానికి జోష్‌ వచ్చింది. మరి జగన్‌ను గద్దె దించేస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ప్రతిజ్ఞ ఎంతవరకూ నెరవేరుతుంతో జూన్‌ 4న కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: