జగన్‌, చంద్రబాబు.. గెలుపుపై ఆయనకే ఎక్కువ ధీమా ఉందా?

ఏపీలో ముగిసిన పోలింగ్ పై ఆయా పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే మీడియా సమావేశం నిర్వహించి కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది అని ప్రకటించారు. అనూహ్య ఫలితాలు మీరు చూడబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారణాసి టూర్ లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయానికొస్తే ధర్మం గెలిచింది అని అన్నారు. ఇలా ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సరళి, వచ్చే సీట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ అధికార వైసీపీ అధినేత సీఎం జగన్ మౌనం దాల్చడం చూసి పలువురు విస్మయానికి గురయ్యారు. ఇది ఒకింత చర్చకు సైతం దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ కు ఎదురుగాలి వీచిందని అందుకే ఆ పార్టీ నాయకులు మాట్లాడటం లేదనే విమర్శలు వచ్చాయి.

అయితే ఎన్నికలు జరిగిన మూడు రోజుల అనంతరం బయటకు వచ్చిన సీఎం జగన్  ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2019లో వచ్చిన 151 స్థానాలు.. 22 ఎంపీ సీట్ల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. జూన్ 4న దేశం మొత్తం ఏపీ వైపు చూడబోతుందని అన్నారు.

ఈ సంగతి ఇలా ఉంటే.. చంద్రబాబు వ్యవహార శైలి మరోలా ఉంది. జగన్ ఏమో కాన్ఫిడెంట్ గా 151 సీట్లు దాటుతాం.. క్లీన్ స్వీప్ చేస్తామని బలంగా చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం సీట్ల సంఖ్యను వెల్లడించడం లేదు. అధికారంలోకి వస్తామని మాత్రమే చెబుతున్నారు. అంటే కొన్ని వర్గాల ప్రజలు ఇంకా వైసీపీకే అనుకూలంగా ఉన్నారని చెప్పకనే చెప్పారు. దీని బట్టి చూస్తే రాష్ట్రంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నాయకులకి కూడా నమ్మకం లేదు. అధికారంపై నమ్మకంగానే ఉన్నా.. సీట్లపై వారికి ఎక్కడో తేడా కొడుతోంది. అందుకే జగన్ మాదిరి కాన్ఫిడెంట్ గా సీట్లు ప్రకటించలేదని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: