2019 సీన్ రిపీట్: జగన్ ట్రాప్‌లో మళ్లీ బాబు పడిపోయారా?
గత ఎన్నికల ముందు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరి ఇలానే ఉండేది. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడంతో ఏపీ ప్రజలు చంద్రబాబుని అపారంగా నమ్మారు. ఆయన సీనియార్టీని గౌరవించి, తప్పకుండా ప్రత్యేక హోదాని తెచ్చి పెడతారని భావించారు. మద్దతు తెలిపి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అంటూ ఒప్పుకున్నారు. అదే అంశాన్ని జగన్ హైలెట్ చేయడంతో యూటర్న్ తీసుకున్నారు.
ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వాన్ని విభేదించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ప్రత్యేక హోదా పల్లవిని అందుకున్నారు. దీంతో ప్రజలకు చులకన అయ్యారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలోను చంద్రబాబు చేసిన ఆరోపణలు అలానే ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఈ వ్యవస్థపై విషం చిమ్మారు. ప్రజాస్వామ్యానికి విఘాత వ్యవస్థగా అభివర్ణించారు.
అటు సచివాలయ వ్యవస్థను సైతం తప్పుపట్టారు. అక్కడ 11 శాఖలకు సంబంధించి సహాయకులు అవసరమా అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట వీటిని సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్లు నిలిచిపోవడంతో పండుటాకులు రోడ్లపైకి వస్తున్నారు. అయితే వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులు ఇవ్వొచ్చు కదా అని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనినే వైసీపీ ప్రచార అస్త్రంగా మలచుకొంది. సచివాలయ వ్యవస్థను వద్దన్న వారే చేతే వారి సేవలు వినియోగించుకోవచ్చు అంటూ చెప్పే స్థాయికి జగన్ తీసుకువచ్చారు అని పోస్టులు పెడుతున్నారు. ఇది ఏరకంగా చూసినా జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడ్డారనే టాక్ నడుస్తోంది.