ఆ బెయిల్‌ రద్దయితే.. వైసీపీ గుండెల్లో మొదలైన దడ?

ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది. మరోవైపు జగన్‌ను వివేకా హత్య కేసు అంశం వెంటాడుతోంది. ఏకంగా సొంత చెల్లెళ్లిద్దరూ ఈ విషయంలో జగన్‌పై కత్తి కట్టారు. అయినా సరే జగన్‌ ఈ కేసులో నిందితుడైన అవినాష్‌ రెడ్డి వైపే ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకే మళ్లీ కడప టికెట్‌ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు కడప ఎంపీ సీటు పోరాటం రాష్ట్రం మొత్తం మీద ఆసక్తికరంగా మారింది.

ఇలాంటి సమయంలో ఇప్పటికే బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే.. ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ నేతలను వణికిస్తోంది. ఎందుకంటే.. వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరింపులకు గురిచేస్తుంటే...నిందితుడు అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐని విచారణ సందర్భంగా నిలదీసింది. తనకు రక్షణ లేదని..చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి డిసెంబర్‌లోనే ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని న్యాయమూర్తి సీఐబీని కేసు విచారణలో ప్రశ్నించారు.

అవినాష్‌రెడ్డి  ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌  విచారణ చేపట్టారు. దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. నిందితుడు అవినాష్‌రెడ్డి హైకోర్టు బెయిలు షరతులను ఉల్లంఘించారన్నారు. అవినాష్‌రెడ్డి అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేసి, గాయపరిచారని జడ శ్రావణ్‌కుమార్‌ వివరించారు.

అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. దస్తగిరి రక్షణ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారన్నారు.  ప్రత్యామ్నాయాలపై నిర్ణయం రాకుండానే ఇక్కడ పిటిషన్‌ వేయడం సరికాదని వాదించారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: