కేటీఆర్‌: సిల్లీగా కాదు.. ఇంకాస్త పక్కాగా ప్లాన్‌ చేయవయ్యా?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన వంద రోజుల పాలనలో పాలనా పరంగా ఫర్వాలేదనిపించినా.. ఎక్కడో చిన్నచిన్న సమన్వయ లోపాలు కొన్ని కళ్లముదే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు.. దీంతో పార్టీ బాధ్యతను అటు కేటీఆర్.. ఇటు హరీశ్ రావులు ఇద్దరూ మోస్తున్నారు.

హరీశ్ రావు మాస్ లీడర్. ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అదే కేటీఆర్ విషయానికొస్తే క్లాస్ ఫ్లస్ మాస్. ఎక్కువ శాతం క్లాస్ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంలో తన ప్రత్యేక శైలిని చూపించి తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలిగారు. తన వాక్ చాతుర్యంతో అనేక అంతర్జాతీయ వేదికల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు. ఇతర పార్టీ నేతలను ఇరకాటంలో పడేయడం.. పంచ్ డైలాగ్ లతో కార్యకర్తల్లో జోష్ నింపడం వంటివి  కేటీఆర్ చేస్తుంటారు.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నగరంలో పర్యటిస్తున్న కేటీఆర్ తాజాగా హైదరాబాద్ నీటి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఒక్క మార్చిలోనే హైదరాబాద్ లో 2.30లక్షలకు పైగా వాటర్ ట్యాంకులు బుక్ అయ్యాయని ఆరోపించారు. 20వేల లీటర్లు తాగునీటిని ఉచితంగా ఇవ్వాలని.. ప్రభుత్వం ట్యాంకర్లకు రుసుం వసూలు చేస్తుందని వీటిని ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే..ఆవేదన కలుగుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. ఉద్యమ నేపథ్యం కలిగిన వారని గుర్తు చేస్తున్నారు.  నిజంగా కేటీఆర్ ఆరోపించిన విధంగా స్థానిక పరిస్థితులు లేవని వివరిస్తున్నారు.  హైదరాబాద్ లో ట్యాంకర్ల సంస్కృతి ఇప్పటిది కాదని.. దీనికి బీఆర్ఎస్ పాలన అతీతమేమీ కాదని.. గత ప్రభుత్వ పాలనలో కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోతున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు కేటీఆర్ స్థాయికి తగవని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: