లోకేశ్: జెడ్‌ కేటగిరీ.. ప్లస్సు కాదు మైనస్సే?

టీడీపీ యువ నేత నారా లోకేశ్ కు జడ్ ప్లస్ భద్రతను కేంద్రం కల్పించింది. దీనిని ఒక గొప్పగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. భద్రత పెంచడంతో యువనేత ఒకస్థాయికి ఎదిగిపోయారని చెప్పుకొస్తున్నారు. ఆయన ఇంటి గుమ్మం నుంచి బయటకు రాగానే ఏకే 47 తుపాకులు పట్టుకొని ఉన్న నలుగురు  ఆయన్ను ఫాలో అయ్యే చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇది మా నాయకుడి ఘనత.. కేంద్రం అడిగిన వెంటనే భద్రత కల్పించిందని కేంద్రం ప్రభుత్వంతో మాన నేతకు ఉన్న సన్నిహిత సంబంధానికి ఇది ఒక మచ్చు తునక అని టీడీసీ సోషల్ మీడియా విభాగం హోరెత్తిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేతకు ఈ స్థాయి భద్రత అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సామాన్యులు లోకేశ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా జెడ్ క్యాటగిరిలో ఉన్న నేతలకు సామాన్యులను కలుసుకోవడం అతి కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే గర్భగుడిలో దేవుడు లెక్కే. ఇటు వంటి భద్రత ఎదుగుతున్న నాయకుడికి సరి కాదని చెబుతున్నారు. పార్టీ క్యాడర్ లోకేశ్ ను కలవాలన్నా కష్టమే. గతంలో లోకేశ్ ను కలవాలంటే పార్టీ నాయకులు ఇట్టే కలిసేశారు. ప్రైవేట్ సిబ్బంది ఉన్నా వారితో అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇక నుంచి అలా కుదరదు. ఇది తెలియక టీడీపీ కార్యకర్తలు గొప్పలు చెప్పుకుంటున్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతటా చుట్టేస్తున్నారు. జనసేన అధినేత కూడా దాదాపు తమ  పార్టీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తిరిగేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కానీ నారా లోకేశ్ మాత్రం మంగళగిరికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఆయన జెడ్ సెక్యూరిటీతో ఆయా నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్లడం కష్టం. ప్రజలతో మమేకం కావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇది జెడ్ ప్లస్ కంటే మైనస్సే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: