పవన్ కోసం గ్రౌండ్‌ రెడీ చేసిన చంద్రబాబు?

మొత్తానికి పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి వర్మ రూపంలో ఉన్న అడ్డంకిని చంద్రబాబు తొలగించారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అక్కడి టీడీపీ ఇన్ ఛార్జి ఎన్నవీఎస్ వర్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒకానొక దశలో ఆయన రెబల్ గా పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగింది. దీంతో పాటు వర్మ అనుచరులు కూడా పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అక్కడి టీడీపీ కార్యాలయంలో ఫ్లెక్సీలను తొలగించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కూటమికి నష్టం కలిగిస్తాయని చంద్రబాబు భావించారు. అందుకే వెంటనే రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

వాస్తవానికి వర్మ రెబల్ గా పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన వెంట చంద్రబాబు ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు పొత్తుల పేరుతో అక్కడి అభ్యర్థిని.. రెబల్ గా పోటీ చేయించి వెనుక నుంచి తన మద్దతు అందించేవారు. ఇప్పుడు కూడా ఇదే తరహా ప్రచారం సాగింది. మరోవైపు వైసీపీ నాయకులు పవన్ ను మేం ఒడించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబే ఓడిస్తారు అని విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది.

కానీ చంద్రబాబు ఈసారి ముందస్తుగా జాగ్రత్త పడ్డారు. వర్మను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు తప్పవని ప్రభుత్వం ఏర్పడగానే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధినేత ఇచ్చిన హామీలకు ఓకే చెప్పారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం వివాదం సద్దుమణిగింది. మరోవైపు పవన్ కల్యాణ్ విజయం చంద్రబాబుకి కూడా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఆయనే ఓడించారు అనే అపవాదు మూటకట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే రంగంలోకి దిగి మాట్లాడి సెట్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబుని అభినందించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: