పాతికేళ్లనాటి పాత పోస్టులోకి మళ్లీ చంద్రబాబు?

తెలుగుదేశం ఎన్డీయేలో కి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఎన్నికల ముందు కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి ఎన్డీయేలో చేరేందుకు యత్నాలు మొదలు పెట్టింది. నాలుగన్నరేళ్లుగా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దానికి ఇప్పుడు ముహూర్తం కుదరింది. టీడీపీ ఎన్డీయేలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే టీడీపీ ప్రతి కార్యకర్త ఏమని భావిస్తారు అంటే ప్రధాని కావాల్సిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీకి పరిమితం అయ్యారు. ఆయనది అమెరికా అధ్యక్షులుకు, ప్రపంచ నేతలకు సలహాలు ఇచ్చే స్థాయి అని కీర్తిస్తారు. ఇప్పుడు కొత్తగా మరో రాగం అందుకున్నారు. గతంలో ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామి. ఒకానొక సమయంలో ఆయన ఎన్డీయేకి సారథ్యం కూడా వహించారు. ఆ సమయంలో ప్రధాని అభ్యర్థులను సైతం ఆయనే నిర్ణయించేవారు.  ఇదంతా ఒకప్పటి లెక్క.

ఇప్పుడేమో అదే కూటమిలోకి చేరేందుకు దిల్లీలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. చంద్రబాబు అంత శక్తే ఉంటే ఎందుకు మోదీ కోసం.. కూటమిలోకి బీజేపీని చేర్చుకునేందుకు వెంపర్లాడారు అని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటారు. ఇది పక్కన పెడితే.. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీయే లో కి ఎంట్రీ ఇచ్చారో ఆయన్నే దీనికి కన్వీనర్ చేస్తారంటూ మరో ప్రచారం మొదలు పెట్టారు. పొత్తు కోసమే ఆయన పడరాని పాట్లు పడితే.. ఇప్పుడు ఏకంగా కన్వీనర్ అంటూ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఒకప్పుడు ఎన్డీయేకి సారథ్యం వహించారు ఏమో కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు.  కాగా ఇదే పదవి కోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్ పట్టుబట్టి కూటమి నుంచి వైదొలిగారు. అక్కడ ఇండియా కూటమి ఏర్పాటు చేస్తే అక్కడ కూడా పదవి ఇవ్వకపోయే సరికి తిరిగి బీజేపీతో చేతులు కలిపారు. ఈ కన్వీనర్ పదవితో లేని పోని తలనొప్పులు వస్తాయని భావించే మోదీ-షా ద్వయం దీనిని తీసేశారు. ఒకవేళ ఈ పదవి సృష్టించినా..దానిని బీజేపీ నేతల చేతుల్లో పెట్టుకుంటారు తప్ప వేరే పార్టీకి ఇవ్వరు అనేది సుస్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: