ఏపీలో బీజేపీ సీట్లు డిసైడ్‌ చేసేది ఆయనేనా?

పొత్తుల్లో ఇన్ని మలుపులు, పిలుపులు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఎట్టకేలకు ఏపీలో కూటమికి ఒక స్వరూపం వచ్చింది. ఆరేళ్ల తర్వాత ఎన్డీయేలో టీడీపీ చేరిక ఖాయమైంది. గత రెండు రోజులుగా దిల్లీలో  చంద్రబాబు తో పవన్ కల్యాణ్ ఉండి బీజేపీ పెద్దలతో సమావేశాలు నిర్వహించి పొత్తును ఓకే చేయించారు.  చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసిన నెల తర్వాత తిరిగి మళ్లీ చర్చలు జరిపి ఎన్డీయేలో చేరారు.

దీంతో సీట్ల సర్దుబాటు, పొత్తు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ పొత్తు ఖరారు అయిందని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు దిల్లీ నుంచి టీడీపీ కీలక నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉండగా… టీడీపీ ఎన్డీయేలో చేరిక విషయం మాత్రమే ఈ సమావేశంలో చర్చించారు. ఎవరు పోటీ చేస్తారు..ఎన్ని సీట్లలో పోటీ చేయాలి. తదితర అంశాలన్నీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతోనే మాట్లాడాలని అమిత్ షా, నడ్డా చంద్రబాబు కి సూచించారు. బీజేపీ, జనసేనకు కలిపి 30 సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే 35 వరకు కావాలని బీజేపీ పట్టుబడినట్లు సమాచారం.

దీంతో పాటు పది ఎంపీ స్థానాలను సైతం డిమాండ్ చేస్తోంది. ఈ విషయాల గురించి ఇప్పుడు సంతోష్ జీ కీలక చర్చలు జరుపుతారు. ఇప్పుడు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి. ఎవరెవరు బరిలో ఉండాలనే కీలక నిర్ణయాలు కూడా సంతోష్ జీనే తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని సీట్లు తీసుకోవాలో బీజేపీ అధిష్ఠానం సంతోష్ జీకి చెప్పే ఉంటుంది. ప్రస్తుతానికి సీట్ల వ్యవహారం తేలకపోయినా.. ఈ విషయాలన్నీ ఒక్క సంతోష్ జీకే తెలుసని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: