ఆంధ్రా రాజకీయాల్లో ఇదేం దరిద్రం..?

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అలా చూస్తూ.. చూస్తూ  నిమిషాలు.. గంటలు.. ఇలా గడిచిపోతూ ఉన్నాయి. దీంతో వీధికి ఒక వాట్సప్ గ్రూప్, ఫేస్ బుక్ అకౌంట్ లతో జనం బిజీబిజీ గడుపుతున్నారు.  దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం కల్పించుకునేందుకు రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియా ప్రచారానికి తెర లేపుతున్నారు.

రాజకీయంగా పార్టీల పరంగా వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టిస్తూ తమ కార్యక్రమాలు అందులో పోస్టు చేస్తున్నారు.  వీటిని వీలైనంత మందికి షేర్ చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం పొందుతున్నారు. ఇప్పుడు  రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకు వేసి.. డబ్బులు చెల్లించి మరీ.. సోషల్ మీడియాను నిర్వహిస్తున్నారు.

ఇందులో ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం.. తమ పార్టీ మ్యానిఫెస్టోలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా తీరు మారింది. రాజకీయంగా డబ్బులు వెచ్చించి వీటిని నడినించే నిర్వహకులు పోస్టులు శ్రుతి మించుతున్నాయి. వాస్తవానికి వ్యంగస్త్రాలు, ప్రత్యర్థులను విమర్శించే కార్టూన్లు సబబే అయినా రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని.. వారి వ్యక్తిగత జీవితాన్ని కించ పరిచే పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. వీరికి పార్టీ పెద్దల నుంచి కూడా మద్దతు లభించడంతో అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. అసభ్యతతో కూడిన పోస్టులు అంటే ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగి వికృత పోస్టులు పెడుతున్నారు. జగన్, చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ కావొచ్చు.. వీరి కుటుంబ సభ్యులను, భార్యలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవి అసభ్యంగా కూడా కాదు అసహ్యం పుట్టిస్తున్నాయి. హుందాతనంగా ఉన్న కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి వ్యక్తిగతంగా కించపరుస్తున్నారు. వీటిని అదుపు చేయాల్సిన పార్టీ అధినేతలు, నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి ఈ తరహా పోస్టులపై అన్ని పార్టీల నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: