రేవంత్‌ వ్యూహం: ఆ కులం కోసమే చిన్నోడికి ఎంపీ ఛాన్స్?

యువజన కాంగ్రెస్ నేత అనికుమార్‌ యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించారు. టికెట్‌ దక్కిన రోజే ఈ విజయం ఖాయమైంది. అయితే అనిల్ కుమార్ యాదవ్‌ వంటి యువకుడికి రాజ్యసభ టికెట్ ఇవ్వడమే చర్చనీయాంశం అయ్యింది. రాజ్యసభ సీటు సాధారణంగా పెద్దలకు ఇస్తుంటారు. అలాంటి ఛాన్స్‌ను ఓ చిన్న కుర్రాడికి ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఉన్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కుర్మలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పాలికారని అంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మరింత మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా తాము కృషి చేస్తామని అనిల్‌ కుమార్‌ యాదవ్ కూడా ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇది చరిత్రాత్మక దినం అని రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్ అంటున్నారు. రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో నియామక పత్రాన్ని తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్‌ ఆ తర్వాత భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. తొలుత భారీ కాన్వాయ్‌తో బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్‌లో అనిల్‌ కుమార్‌ యాదవ్కు ఘనస్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధిష్టానం తమ సామాజిక వర్గానికి గొప్ప అవకాశం కల్పించిందని అనిల్‌ కుమార్‌ యాదవ్ అన్నారు. చిన్న వయసులో కాంగ్రెస్ తనకు అధిష్టానం పెద్ద పదవి ఇచ్చిందని అనిల్‌ కుమార్‌ యాదవ్ అన్నారు. ఇది నా జీవితంలో గొప్ప సంఘటన అని అనిల్‌ కుమార్‌ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేతలుతోపాటు తెలంగాణ అగ్రనేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అనిల్‌ కుమార్‌ యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఒక బీసీ బిడ్డని పెద్దల సభకు పంపుతున్నారంటే ఇది బీసీలందరికీ గర్వకారణం అని అనిల్‌ కుమార్‌ యాదవ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: