టీడీపీ- జనసేన సీట్ల గొడవలో అసలైన ట్విస్ట్‌ ఇదే?

ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సామాజిక లెక్కలతో సీఎం జగన్ అభ్యర్థులను మార్చుతున్నారు. సర్వేలు చేయించి బలహీనంగా ఉన్న చోట్ల సిట్టింగ్ లను పక్కన పెడుతున్నారు.  మొత్తం 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపే పనిలో ఉన్నారు. అయితే జగన్ సర్కారు ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే వ్యూహంతో టీడీపీతో జత కలిశారు. జనసేనకు మిత్రపక్షమైన బీజేపీని ఇందులో చేర్చేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూటమిలో చేరాలా? జనసేనను వదులుకోని సింగిల్ గా పోటీ చేయాలా అనే విషయంపై ఆ పార్టీ డైలామాలో ఉంది. ఒకవేళ కమల నాథులు వచ్చినా రాకున్నా తాను మాత్రం టీడీపీ వెంటే నడుస్తానని పవన్ స్పష్టం చేశారు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఓ పక్క వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. కానీ టీడీపీ, జనసేన కూటమి సీట్ల పెంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రెండు పార్టీల మధ్య సమన్వయం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ..

కూటమిలో ఉన్న పార్టీలు అభ్యర్థులను ఎప్పుడూ ముందస్తుగా ప్రకటించవు అని చెబుతున్నారు.  తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐకి ఆఖరి నిమిషంలో సీటు కేటాయించింది. అలాగే నామినేషన్ ముందు రోజు కూడా అభ్యర్థులను ప్రకటించింది. అయినా ఆ పార్టీ  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.  రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు సీట్ల పంపకాల్లో ఆలస్యం సహజమే. ఒకే స్థానానికి రెండు పార్టీల అభ్యర్థులు పోటీ పడతారు కాబట్టి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది.  ఈ మాత్రం దానికే ఆ పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదు అని ప్రచారం చేయడం అవివేకం అవుతుందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: