ఈటల, బండి సంజయ్.. ఎవరిది పైచేయి?

పోయిన చోటే వెతుక్కొవాలని తెలంగాణ బీజేపీ  భావిస్తోంది. బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ డీలా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది.

తాజాగా ఆ పార్టీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్తోంది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది.  బండి సంజయ్, ఈటల రాజేందర్ లో ఒకరని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నా.. పార్టీ మాత్రం ఇద్దరినీ సమాన దృష్టితో చూస్తున్నట్లు తెలుస్తోంది.  ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు అనే ఉద్దేశాన్ని పార్టీలోకి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  

ఇటీవల బీసీ ఆత్మగౌరవ సభ హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారన్న చర్చా జరిగింది.  అయితే ఈ సభలో మోదీ బండి సంజయ్, ఈటల రాజేందర్ కు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈటలను పక్కన కూర్చోబెట్టుకోవడం, బండి సంజయ్ ని అభినందించడం వంటివి సభలో జరిగాయి. టికెట్ల కేటాయింపులో కూడా వీరిద్దరినీ నొప్పించకుండా ఇచ్చారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

బీజీపీ ఇటీవల విడుదల చేసిన 12మంది అభ్యర్థుల జాబితాలో వేములవాడ టికెట్ ను ఈటల అనుచరురాలు తుల ఉమకు కేటాయించింది. అయితే ఈ స్థానానికి తన కుమారుడు వికాస్ రావుకు కేటాయించాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అలాగే హుస్నాబాద్ విషయంలోను ఈటల తన అనుచరుడు సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరగా..పార్టీ మొండి చేయి చూపింది. ఆ స్థానాన్ని బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించింది. దీంతో ఎవరినీ నొప్పించకుండా ఈటల, బండి సంజయ్ పెట్టిన ప్రతిపాదనలకు సున్నితంగా హ్యాండిల్ చేసి ఇద్దరకీ సమన్యాయం చేసిందనే చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: