తెలంగాణ బీజేపీకి జనసేన తలనొప్పి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా కొన్ని పార్టీల మధ్య పొత్తుల సయోధ్య కుదరడం లేదు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన జనసేన, బీజేపీ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. జనసేన తో పొత్తు కోసం అధిష్ఠానం ఆసక్తి చూపుతున్నా స్థానిక  నేతలకు మాత్రం ఈ విషయం మింగుడు పడటం లేదు.  ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ కి వచ్చే లాభం లేదని పలువురు సీనియర్ నేతలు వాపోతున్నారు.

బండి సంజయ్ నేతృత్వంలో ఉవ్వెత్తున లేచిన పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించినా.. బీజేపీ ఇంకా ఈ విషయంలో వెనుకబడే ఉంది. దీనికి కారణం ఆ పార్టీ లో టికెట్ దక్కని నేతలు బీజేపీలోకి వస్తారని అధిష్ఠానం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్తవారికి పెద్ద పీట వేస్తూ తమ జాబితాలను విడుదల చేసింది.

ఆంధ్రా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేనతో పొత్తు కుదుర్చుకొని ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి 10 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.  అయితే దీనిపై స్థానిక బీజేపీ నేతలు జనసేనకు తెలంగాణలో నాయకులు, క్యాడర్ లేదని ఆ పార్టీ కోసం తమ సీట్లు త్యాగం చేయమని వారు తెగేసి చెబుతున్నారు.

ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వివేక్, రాజగోపాల్ రెడ్డి లు బీజేపీని వీడటం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి.  మరోవైపు శేరిలింగంపల్లి, తాండూర్ టికెట్ లను జనసేన ఆశిస్తోంది.  ఆ స్థానంలో తాను చెప్పిన నాయకులకే టికెట్ ఇవ్వాలని కొండా విశ్వేశర్ రెడ్డి అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాటిని గెలిచి చూపిస్తానని.. లేకుంటే పార్టీ మారతానని అల్టిమేటం జారీ చేశారని సమాచారం. ఇప్పటికే కూకట్ పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర చోట్ల  ఆపార్టీ నాయకులు రాజీనామాలు చేస్తూ బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: