తెలంగాణ ఎన్నికల్లో "కులం" ఉందా? గెలిపిస్తుందా?
మనం ఇతర రాష్ట్రాలను గమనించినట్లయితే ఉత్తర్ ప్రదేశ్ లో యాదవులు సమాజ్ వాదీ పార్టీని , బిహార్ లో కుర్మీలు జేడీయూని, కర్ణాటకలో లింగాయత్ లు బీజేపీకి, ముస్లింలు ఎంఐఎం ను, బ్రాహ్మణులు, ఓబీసీలు బీజేపీని, పొరుగు రాష్ట్రమైన ఏపీలో వైసీపీని రెడ్డి సామాజిక వర్గం, టీడీపీని కమ్మ సామాజిక వర్గం ఇలా ఆదరిస్తుంటారు. తెలంగాణ లో ఏ సామాజిక వర్గం కూడా రాజకీయ పార్టీని అంటిపెట్టుకుని లేదు. ఒక సామాజిక వర్గం మొత్తం గంపగుత్తుగా ఒకే పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు.
వీటికి కారణాలు లేకపోలేదు. తెలంగాణ పోరాటాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం. తొలుత సాయుధ పోరాటం, ఆ తర్వాత నక్సలైట్ల ప్రభావం, తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో అన్ని సామాజిక వర్గాల వారు పాల్గొన్నారు. దీంతో అన్ని సామాజిక వర్గాల మధ్య సమన్వయం ఏర్పడింది.
రెండోది రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ కు కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటకీ మొదట నుంచి కాంగ్రెస్ కు అండగా ఉన్న రెడ్డి సమాజిక వర్గాన్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. బీజేపీ బీసీలను టార్గెట్ చేసి బీసీ నేత బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించినా ఆయన్ను తప్పించి కిషన్ రెడ్డి కి బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో వారు కొంత నిరాశ చెందారు. ఇప్పుడు ఎవరూ కూడా ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిచ్చే ఆలోచనలో లేరు.