సెప్టెంబర్‌ 1.. జగన్ ఇంటిపై దాడి తప్పదా?

సీపీఎస్‌ అంశంలో ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో యధావిధిగా సీ పీఎస్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయని  సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులు సెప్టెంబర్ 1 తేదీన చలో విజయవాడ, సీ ఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. నిన్నటి చర్చల సందర్భంగా ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఉద్యోగులు భావించారు. కానీ.. ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో తమ కార్యక్రమాల కొనసాగింపుకే ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

అంటే.. ఇక సెప్టెంబర్ ఒకటిన చలో విజయవాడ, సీ ఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలు ఉంటాయన్నమాట.. గతంలో ఒకసారి ఇలా పిలుపు ఇచ్చే ఉద్యోగులు విజయవాడలో తమ సత్తా చాటారు. దీంతోనే అప్పట్లో పీఆర్సీ అంశంపై జగన్ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే.. అది అనూహ్యంగా జరిగింది.. ఆ ఘటన కారణంగానే గౌతమ్ సవాంగ్‌ ను బదిలి చేశారని కూడా చెబుతుంటారు. ఇక ఇప్పుడు ఈ చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో చూడాలి.

ఉద్యోగులు మాత్రం జగన్ సర్కారుపై మండిపడుతున్నారు. సీపీఎస్ అమలు సాధ్యం కాదని తెలిసినప్పుడు.. ఎందుకు హామీ ఇచ్చారని ఉద్యోగులు నిలదీశారు. జీపీఎస్ గురించి మాత్రమే చర్చిద్దామంటే.. మమ్మల్ని ఎందుకు పిలవడం ఎందుకనీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు జగన్ వైఖరితో రోడ్డున పడ్డారన్నారు.  సీపీఎస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ ఆరు నెలలుగా ఎందుకు చెల్లించడం లేదని ఉద్యోగులు ప్రశ్నించారు.

జగన్ ఇచ్చిన హామీని నమ్మి మోసపోయామనే భావనలో సీపీఎస్ ఉద్యోగులంతా ఉన్నారని చెబుతున్నారు. తమ ఆందోళనలను అణిచేస్తే  ఆవేదన చల్లారదని పేర్కొన్నారు. తమ ఆందోళనను శాంతియుతంగా చేసుకుంటామంటోన్న అనుమతి ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోయారు. గత ఏడేళ్లుగా నిర్వహించుకుంటున్న విధంగానే ఇప్పుడు సభ పెట్టుకుంటే ఆంక్షలు ఎందుకని ఉద్యోగులు నిలదీశారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగుల బ్లాక్ డే జరిపి తీరతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: