ఒక్క దెబ్బతో నేషనల్ ఫిగర్‌ అయిన రాజాసింగ్‌?

రాజాసింగ్.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే.. ఈయన రూటే సెపరేటు.. ఉత్తరాది మూలాలున్న ఈ బీజేపీ నాయకుడు.. అతి వాద హిందూ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల పక్కనే ఉన్న నియోజక వర్గంలో హిందూవర్గ నాయకుడిగా పేరు తెచ్చుకుని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే రాజాసింగ్‌ ఇన్నాళ్లు రాష్ట్ర స్థాయి వార్తల్లో కనిపించేవారు.


ఇక ఇప్పుడు ఓ మత ప్రవక్తపై చేసిన వివాదాస్పద వీడియో కారణంగా ఏకంగా జాతీయ స్థాయి వార్తల్లో కనిపిస్తున్నారు. చివరకు ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా సొంత పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేసిన బీజేపీ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. రాజాసింగ్ వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనపై పలు ఠాణాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను నిన్న అరెస్టు చేయడం.. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో విడుదల చేయడం అంతా ఉద్రిక్తతల మధ్య సాగింది.


ఈ వరుస ఘటనలతో రాజాసింగ్ ఒక్కసారిగా నేషనల్ ఫిగర్ అయ్యారు. గతంలో నుపుర్ శర్మ తరహాలోనే ఈయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయని భావించిన బీజేపీ అధిష్ఠానం తక్షణం స్పందించింది. రాజాసింగ్‌ పై వెంటనే  సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. సస్పెండ్‌ చేయడమే కాదు.. గతంలో పార్టీ ఆయనకు అప్పజెప్పిన అన్ని బాధ్యతల నుంచి వెంటనే తప్పించారు. అంతే కాదు.. పార్టీ నుంచి నిన్ను ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ సెప్టెంబరు 2 వరకూ గడువు ఇస్తూ షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.


తాజా వివాదంతో రాజాసింగ్ భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఆయన్ను బహిష్కరించినా.. అదంతా పైపైకి మాత్రమే అన్న విషయం బహిరంగ రహస్యమే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ కూడా ఇదే తరహా అతివాద ప్రవర్తనతోనే ఫేమస్ అయ్యారు. ఇప్పుడు రాజాసింగ్ ఆయనకు పోటీ వచ్చేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: