మంత్రి మల్లారెడ్డికి ఘోర అవమానం..అందుకేనా?

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఘోర అవమానం జరిగింది. సొంత కులస్తుల సభలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన ప్రసంగిస్తుంటే.. సభలోని రెడ్లు వ్యతిరేక నినాదాలు చేశారు.. దిగిపో.. దిగిపో అంటూ అరిచారు.. కొందరైతే ఏకంగా బూతులు వాడేశారు. అసలే మల్లారెడ్డి.. అంత సులభంగా తగ్గే రకం కాదు కదా.. సభికులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో సజావుగా సాగుతున్న సభలో గందరగోళం నెలకొంది.

ఇదంతా నిన్న ఘట్‌ కేసర్‌లో జరిగిన రెడ్డి సింహగర్జన సభలో జరిగిన విషయం. మంత్రి మల్లారెడ్డిని అడ్డుకోవడం ఆయన స్టేజ్‌ దిగి వెళ్లిపోతుంటే.. కాన్వాయ్‌పై ఏకంగా రాళ్లు, కుర్చీలు విసరడం సంచలనంగా మారింది. దీంతో రెడ్ల సింహగర్జన సభ రసాభాసగా మారింది. రూ.5000 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని దీనిపై ప్రకటన చేయాలని సభకు హాజరైన రెడ్లు డిమాండ్ చేశారు. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. మల్లారెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొగుడుతూ ప్రసంగించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేశారు. రెడ్లకే కాదు.. అన్ని కులాలను కేసీఆర్‌ ఆదుకుంటున్నారని మాట్లాడారు.. ఆ ప్రసంగం చేసిన తీరు రెడ్లకు నచ్చలేదు. ఉన్నది చెబితే తప్పేంటి.. అంతకు ముందు ఎవరైనా రెడ్లకు ఏమైనా చేశారా.. అంటూ మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. రెడ్లకు ఆవేశం ఎక్కువ అని.. ఉద్రేకం ఎక్కువ అని మాట్లాడారు. అలా వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఆయన ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని నిర్వాహకులు భయపడిపోయే పరిస్థితి కనిపించింది.

ఒక దశలో మల్లారెడ్డి కూడా తగ్గారు.. ఎందుకొచ్చిన గొడవ అని.. రెండు మాటలు మాట్లాడి. జై రెడ్డి.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి స్టేజీ నుంచి కిందకు దిగిపోయారు. ఆ సమయంలో మంత్రి మల్లారెడ్డి వాహన శ్రేణిపై నిరసన కారులు రెచ్చిపోయారు. చేతికందిన వస్తువులు కాన్వాయ్‌పై విసిరారు. చెప్పులు, కుర్చీలు, నీళ్ల బాటిళ్లు.. ఏది దొరికితే దాంతో కాన్వాయ్‌ పై దాడి చేశారు. పోలీసులు పాపం.. పావు గంట సేపు కష్టపడి ఆయన్ను ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఆయన ఎంతసేపూ కేసీఆర్‌ సర్కారును పొగడటమే ఈ గొడవకు కారణం కావచ్చంటున్నారు సభకు హాజరైనవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: